పట్టా లేని సంజయ్ కి.. పట్టభద్రుల ఓట్లు కావాలా!
posted on Mar 5, 2021 @ 11:52AM
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అధికార , విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలు, సవాళ్లతో కాక పుట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై భువనగిరి సభలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నల్గొండ జిల్లా గులాబీ నేతలు కౌంటరిచ్చారు. బీజేపీ అంటే బ్రోకర్ల జనతా పార్టీ అన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఏం చదువుకున్నాడో తెలియని బండి సంజయ్.. పట్టభద్రుల ఎన్నికల్లో బండి సంజయ్ ఓట్లు అడగడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ రోజూ కుక్క లాగా అరుస్తున్నారని చెప్పారు. ఐటీఐఆర్ అంటే బండి సంజయ్ కు తెలుసా అని ప్రశ్నించారు కిషోర్ కుమార్. ప్రధాని మోడీ నియోజక వర్గం వారణాసి లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో ,ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ కి గుండు సున్నా దక్కిందన్నారు. ప్రేలాపనలు మానక పోతే కరీంనగర్ ప్రజలే బండి సంజయ్ ను చెప్పులతో కొడతారని హెచ్చరించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్.
మోడీ గుజరాత్ ప్రధాని గా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆరోపించారు. అంబానీ ,అదానీల కు మోడీ దేశ సంపాదన దోచి పెడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ని మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అంటారా ? అంటూ సంజయ్ పై మండిపడ్డారు. చట్టసభలంటే గౌరవం లేని సంజయ్ ను జైలుకు పంపించాలన్నారు. బండి బజారు రౌడీ తత్వాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు సైదిరెడ్డి. హిందువుల పార్టీ బీజేపీ అంటున్న బండికి.. పెరిగిన పెట్రోలు ,డీజిల్ ధరలతో హిందువులు కూడా బాధితులు అన్న సంగతి తెలియదా ? అని నిలదీశారు. బండి సంజయ్ బ్రోకర్ల పార్టీ సారధి కనుకే.. అవతలి వాళ్ళను బ్రోకర్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రే స్టేడియం పేరు ను మార్చి తన పేరిట పెట్టుకున్న ఘనుడు మోడీ అన్నారు సైదిరెడ్డి. నయీమ్ వ్యవహారం లో చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. నయీమ్ డబ్బును కక్కించడం సరే ..ముందు మోడీ అన్న నల్ల ధనం కక్కించడం గురించి బండి సంజయ్ మాట్లాడాలని సైదిరెడ్డి హితవు పలికారు.
రిజర్వేషన్ల ను ఎత్తివేసే కుట్రలో భాగంగానే మోడీ ప్రభుత్వరంగ సంస్థలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. .వేలకోట్ల అప్పులు ఎగేసిన ప్రైవేట్ సంస్థలకు మోడీ సర్కార్ కాపలా కాస్తుందన్నారు. రూపాయితో సహా వడ్డీతో కట్టే ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వమే పట్టించుకోవడం లేదన్నారు. గుజరాతిలకు ఒకరేటు...ఆంధ్రుల హక్కు అన్న విశాఖ ఉక్కుకు ఒకరేటు ఉంటుందా అని లింగయ్య ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటీలో కూడా లేవన్నారు చిరుమర్తి లింగయ్య.