మారిస్తేనే..మనుగడ
posted on Nov 15, 2020 @ 1:12PM
సిట్టింగులకే సీట్లని తేల్చేసిన తెరాస
46 మంది సిట్టింగులపై వ్యతిరేకత
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి అధికార టీఆర్‌ఎస్ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా, సిట్టింగ్ కార్పొరేటర్లకే సీట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. మరీ ఏదైనా అవసరం అనుకున్న స్థానాలలో మినహా, మిగిలిన అన్ని స్థానాల్లో సిట్టింగులకే సీట్లు ఇవ్వాలని టీఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్‌లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు, రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఆ మేరకు ఓటర్ల జాబితా ముసాయిదాను కూడా రాజకీయ పార్టీలకు అందించింది. బహుశా ఈ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి రిజర్వేషన్లలో మార్పులు లేకుండానే చట్ట సవరణ చేయడంతో, మునుపటి మాదిరిగానే వార్డు రిజర్వేషన్లు ఉండనున్నాయి.
గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్, ఆ మేరకు కసరత్తు ప్రారంభించింది. అయితే.. తమ నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్లపై ప్రజల వ్యతిరేకతతోపాటు, తమ మాట కూడా వినని స్థాయికి చేరిన కార్పొరేటర్లను తొలగించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దానం నాగేందర్, మాగంటి గోపీనాధ్ వంటి ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు.
అయితే సీఎం కేసీఆర్ తో, మంత్రి కేటీఆర్ ఆ అంశంపై చర్చించిన తర్వాత... సిట్టింగులను మార్చకూడదని నిర్ణయించారట. కావాలంటే ఆయా డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో ఎక్కువ దృష్టి సారించేలా చూడాలని, సీఎం ఆదేశించినట్లు సమాచారం. మరీ అవసరమైతే తప్ప, సిట్టింగులనే కొనసాగించాలని నిర్ణయించారట. సమయం తక్కువగా ఉన్నందున.. సిట్టింగులను మారిస్తే, అది విజయంపై ప్రభావం చూపుతుందన్న ముందు జాగ్రత్తతోనే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల స్థాయి నేతలు.. తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మరి పార్టీ నిర్ణయం నేపథ్యంలో వారి పరిస్థితి ఏమిటన్నది చూడాలి.
కాగా, నగరంలో 46 మంది టీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై.. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు గతంలోనే పార్టీ దృష్టికి వచ్చింది. ఇళ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనుల అంశంలో వీరిపై అనేక ఆరోపణలున్నట్లు ఆ నివేదిక సారాంశం. ప్రజలను పీడించేలా ఉన్న వీరి ప్రవర్తన, ప్రత్యక్షంగా ఎన్నికలపై పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. పేరుకు కార్పొరేటర్లయినా.. భర్తలు, తండ్రులు, కొడుకులు వారిని నిమిత్తమాత్రులను చేసి, పెత్తనం సాగిస్తున్న వైనం ప్రజల్లో వ్యతరేకతకు దారి తీస్తోంది. కొన్ని డివిజన్లలో మహిళా కార్పొరేటర్లపైనే ఎక్కువ ఆరోపణలు వినిపించడం ప్రస్తావనార్హం. మరి ఇలాంటి కీలక అంశాలను కూడా నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదంటే, ఏ వ్యూహంతో ఎన్నికలకు వెళుతున్నామో అర్ధం కావడం లేదని, టీఆర్‌ఎస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం తర్వాత, నగరంలో కొంతవరకూ ఎన్నికల వాతావరణం మారే అవకాశం లేకపోలేదు. అయితే దుబ్బాకకు-గ్రేటర్ ఎన్నికలకూ తేడా ఉన్నప్పటికీ, దుబ్బాక ఫలితం మాత్రం ఎంతో కొంత ప్రభావం చూపించడం ఖాయమంటున్నారు. అది బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా.. కాంగ్రెస్ సానుభూతిపరులైన ఓటర్లను, బీజేపీ వైపు ఆకర్షించే అంశంగా కూడా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కరోనా తర్వాత కేసీఆర్ సర్కారు, ప్రజలను పట్టించుకోలేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న భావన నెలకొంది. ఇంటి పన్నుతోపాటు, తాజాగా కురిసిన భారీ వర్షాల్లో ప్రభుత్వం చేతులెత్తేసిందన్న భావన, మధ్య తరగతి వర్గాల్లో బలంగా నాటుకుపోయింది.
తర్వాత బాధితులకు ఇచ్చిన 10 వేల రూపాయల ఆర్ధిక సాయం మైలేజీ తీసుకురాకపోగా, అసంతృప్తిపరుల సంఖ్యను మరింత పెంచేందుకు కారణమయిందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, స్థానిక పార్టీ నేతలు తమకు కావలసిన వారికి మాత్రమే 10 వేలు ఇప్పించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉండటం ప్రస్తావనార్హం.
వీటికి మించి, నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులలో సర్కారుపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కరోనా కాలంలో జీతాల్లో కోత విధించడం, పీఆర్సీ ఆలస్యం వంటి చర్యలపై ఉద్యోగ వర్గాలు అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారు తమ అసంతృప్తిని ఏ పార్టీకి ఞటు వేయడం ద్వారా వెల్లడిస్తారో చూడాలి.
ఇంత వ్యతిరేక వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ సిట్టింగులకే సీట్లు ఇవ్వడం, ప్రతికూల పరిస్థితిని కొనితెచ్చుకోవడమే అవుతుందని టీఆర్‌ఎస్ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఫైర్‌బ్రాండ్లయిన ఎంపి ధర్మపరి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇప్పటికే హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి, రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, నాగం వంటి లీడర్లు కూడా, ప్రచార బరిలో దిగనున్న విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక పరాజయంతో, టీఆర్‌ఎస్‌కు ప్రతికూల వాతావరణం మొదలయిందన్న సంకేతాలు బలంగా నాటుకుపోయాయి. ఆ క్రమంలో రాజధాని నగరంలో జరగనున్న ఎన్నికలు, టీఆర్‌ఎస్‌కు ప్రాణప్రతిష్ఠతో సమానం. అన్ని ప్రతికూల శక్తులను ఎదుర్కొని విజయం సాధిస్తే ఫర్వాలేదు. కానీ, పరిస్థితులు సహకరించక ప్రతికూల ఫలితాలు ఎదురయితే మాత్రం, పార్టీ ఆత్మరక్షణలో పడక తప్పదంటున్నారు. పైగా.. గ్రేటర్ ఎన్నికలకు మంత్రి కేటీఆరే సారథి అన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. ఫలితాలు ఏ మాత్రం తారుమారయినా, అది కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠకే ప్రమాదమని స్పష్టం చేస్తున్నారు.
-మార్తి సుబ్రహ్మణ్యం