కారు, కాంగ్రెస్ పార్టీలు కలిస్తే రేవంత్ టీమ్ దారెటు! తెలంగాణలో ఏం జరగబోతోంది?
posted on Dec 11, 2020 @ 11:51AM
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇంతకాలంగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బలంగా ఉండటంతో పాటు తెలంగాణలోనూ బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీని ఢీ కొట్టేందుకు కారు, హస్తం పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఇటీవల రైతులు నిర్వహించిన భారత్ బంద్ లో ఈ రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొనడం ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేయాల్సి వస్తే.. కాంగ్రెస్ పైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఇప్పుడు అసక్తిగా మారింది.
టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేయడానికి ఎంపీ రేవంత్ రెడ్డి అంగీకరించే ప్రసక్తే ఉండదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు, గత అరేండ్లుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ నుంచి తనకు సరైన సహకారం లేకున్నా ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టినా, తన మనుషులను అధికార పార్టీ నేతలు వేధించినా వెనక్కి తగ్గలేదు ఫైర్ బ్రాండ్ లీడర్. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై చేస్తున్న పోరాటం వల్లే ఆయనకు జనాల్లో క్రేజ్ వచ్చిందనే చర్చ ఉంది. రేవంత్ రెడ్డి పంచ్ ప్రసంగాల వల్లే టీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని చెబుతారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం ఆయన్ను జనాల్లో హీరోగా నిలిపిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు డివిజన్లు ఆయన పార్లమెంట్ పరిధిలోనివే. కాంగ్రెస్ సాధించిన ఆరు శాతం ఓట్లలో సింహభాగం మాల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో వచ్చినవే.
కేసీఆర్ సర్కార్ పై ఇంత తీవ్ర స్థాయిలో పోరాడిన రేవంత్ రెడ్డి.. ఆ పార్టీతో కలిసి పని చేయడం అసాధ్యమనే అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి కూడా వస్తోంది. ఒక వేళ పార్టీ హైకమాండ్ టీఆర్ఎస్ తో కలిసి పోవాలనే నిర్ణయం తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి తీవ్ర నిర్ణయాలే తీసుకోవచ్చని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి కోసం బీజేపీ ఎప్పటి నుంచో కాచుకుని కూర్చుంది. అయితే బీజేపీలోకి వెళితే రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఉండదని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అంతేకాదు బీజేపీలో ముఖ్యమంత్రి పదవి రేసులో కూడా రేవంత్ రెడ్డి ఉండరు. దీంతో సొంత పార్టీ అయితేనే రేవంత్ రెడ్డికి సూటవుతుందనే చర్చ జరుగుతోంది. తన వాగ్దాటి. పోరాట పటిమతో ఇప్పటికే లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న రేవంత్ రెడ్డికి ప్రజా క్షేత్రంలోనూ ఊహించని సపోర్ట్ లభిస్తుందని ఆయన టీమ్ చెబుతోంది.
రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడితే మాత్రం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ లోని మెజార్టీ నేతలు రేవంత్ వెంట నడిచే అవకాశం ఉంది. టీడీపీ నుంచి తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు మిగితా నేతలంతా రేవంత్ వెంటే ఉంటారు. కాంగ్రెస్ లోని యువ నేతలు కూడా ఫైర్ బ్రాండ్ బాటే పడతారని తెలుస్తోంది. నగరానికి చెందిన యువ నేత ఫిరోజ్ ఖాన్ ఇటీవలే దీనిపై ప్రకటన కూడా చేశారు. రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఉంటుదని, లేదంటే దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఫిరోజ్ ఖాన్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా కొందరు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో కలిసి పని చేయాల్సి వస్తే మాత్రం తెలంగాణలో అనూహ్య మార్పులు ఖాయమనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. రేవంత్ రెడ్డిని దూరం చేసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలానే మారుతుందనే అభిప్రాయమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది.