బీజేపీలోకి నేతల క్యూ!కాంగ్రెస్, కారు పార్టీల బేజారు
posted on Feb 22, 2021 @ 1:43PM
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, సర్వే సత్యనారాయణ, వివేక్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు.. గతంలో వీళ్లంతా ఆయా పార్టీల్లో కీలక నేతలు. ఓ రేంజ్ లీడర్లంతా బీజేపీకి క్యూ కట్టారు. కమలం పూదోటలో తమ అద్రుష్టం పరీక్షించుకుంటున్నారు.
కొందరు సొంత పార్టీలో ప్రాధాన్యత దక్కకపోతో చలో బీజేపీ అంటున్నారు. మరికొందరు తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలని బీజేపీకి జై కొడుతున్నారు. ఇలా అందరి నోటా బీజేపీనే. అందరి చూపూ కమలం పార్టీ వైపే. చేరే వారేమైనా చిన్నా చితకా నేతలా? అంతా హేమాహేమీలే. పార్టీలో, వారి నియోజక వర్గాల్లో స్ట్రాంగ్ లీడర్లే. అయినా.. కాషాయ కండువా కప్పుకుంటున్నారు. రాజకీయంగా తమ స్థానం మరింత బలోపేతం చేసుకుంటున్నారు.
నేటి కూన శ్రీశైలం గౌడ్ నుంచి.. నాటి డీకే అరుణ వరకూ.. ఒక్కొక్కరిదీ ఒక్కో లెక్క. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గ్రేటర్ కాంగ్రెస్ లో గట్టి పట్టున్న నేత. కుతుబుల్లాపూర్ లో ఆయనే కింగ్ మేకర్. కాంగ్రెస్ లో, నియోజక వర్గంలో ఇప్పటికిప్పుడు వచ్చిన కష్టమేమీ లేదు. లోకల్ గా ఆయన మాటకు ఎదురు లేదు. రేవంత్ రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ లో ఆయన భవిష్యత్ కూ డోకా ఏమీ లేదు. అయినా.. హస్తం పార్టీలో కొనసాగలేకపోయారు. కాషాయ కండువా కప్పుకోకుండా ఉండలేక పోయారు. దటీజ్ బీజేపీ. తెలంగాణలో కమలం పార్టీ హవా ఆ రేంజ్ లో ఉంది. ఇతర పార్టీ నేతలను, తటస్తులను, సానుభూతులను సూదంటు రాయిలా ఆకర్షిస్తోంది కమలదళం.
దుబ్బాకలో గెలిచి బీజేపీ సత్తా ఎంతో యావత్ తెలంగాణకు తెలిసొచ్చేలా చేసింది. దుబ్బాక ఫలితాలతో అధికార టీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్. దుబ్బాక గెలుపు గాలివాటం కాదని మరింత బలంగా చాటేలా.. జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకొని కాషాయ పార్టీ కాక మీదుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లపైనా కాషాయ జెండా ఎగరేసేందుకు సై సై అంటోంది. వరుస విజయాలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు సైతం ఆ పార్టీకి బాగా కలిసొస్తోంది. తెలంగాణలో ఏ చిన్న కార్యకర్తకు ఏ చిన్న కష్టమొచ్చిన నేనున్నానంటూ అక్కడ వాలిపోతున్నారు. కేడర్ పై పోలీసుల లాఠీఛార్జీపై గట్టిగా తిరగబడుతున్నారు. బండి జోరు.. బీజేపీకి మరింత బూస్ట్ ఇస్తోంది. ఈ హవా ఇలానే కొనసాగితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు. అందుకే... ఇతర పార్టీల నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు క్యూ కడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు ఉండటం కామన్. గతంలో గులాబీ పార్టీ ఆ విధంగానే బలపడింది. అయితే.. తెలంగాణలో మాత్రం ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితి. ఏకంగా అధికార పార్టీ నేతలే ప్రతిపక్ష బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, వివేక్, జితేందర్ రెడ్డిలాంటి వాళ్లు ఆ కోవకు చెందిన వారే. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలకైతే బీజేపీనే పెద్ద దిక్కుగా మారింది. హస్తం పార్టీలో నాయకత్వ శూన్యత, ఆధిపత్య పోరుతో కాకలు తిరిగిన కాంగ్రెస్ నేతలు సైతం కాషాయ కండువ కప్పేసుకుంటున్నారు. కూన శ్రీశైలం గౌడ్, సర్వే సత్యనారాయణ, డీకే అరుణ.. ఇలా పార్టీలో ఇప్పటికే చేరిన వారు కొందరైతే.. పువ్వు గుర్తు వైపు ఆశగా చూస్తున్న కోమటిరెడ్డిలాంటి లీడర్లు ఇంకా ఎందరో. వారంతా సరైన సమయంలో గోడ దూకేందుకు.. బీజేపీకి జై కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో ఉనికి కోసం పాకులాడుతున్న టీడీపీ దాదాపు ఖాళీ. రేవూరి ప్రకాశ్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు లాంటి మాజీ తమ్ముళ్లంతా ఇప్పుడు కమలం గూటిలో సేద తీరుతున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉండి ఉంటే.. వీళ్లంతా బీజేపీ వైపు ఎందుకు చూసేవారు? అంటే, కారు పార్టీకి ఇకపై తెలంగాణలో భవిష్యత్ లేదనేగా అర్థం? వరుస విజయాలు, జనాల్లో జోష్ చూసి.. ఇక కాషాయ పార్టీదే ఫ్యూచరంతా అనేది వీరి లెక్క. పొలిటికల్ పల్స్ తో పాటు పీపుల్స్ పల్స్ పట్టడంలో ఎక్స్ పర్ట్స్ అయిన నేతలంతా బీజేపీలో చేరిపోతున్నారు. ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత భారీగా పెరగొచ్చు. నేతల చేరికతో.. వెయ్యేనుగుల బలంతో.. ప్రగతి భవన్ వైపు దండయాత్రగా కదులుతోంది కమలదళం.