మండలి ఎన్నికల్లో ఎదురుగాలి! బోగస్ ఓట్లను నమ్ముకున్న గులాబీ ?
posted on Mar 3, 2021 @ 3:53PM
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాయి. మార్చి 14న జరగనున్న పోలింగ్ లో ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని దాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ హోల్డర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళల్లో సగం మందికి పైగా మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. వరుస ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన అధికార పార్టీకి మండలి ఎన్నికలు సవాల్ గా మారాయి. దుబ్బాక, గ్రేటర్ ఫలితాన్నే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటిన్యూ చేసేలా బీజేపీ జోరు పెంచింది. మండలి ఎన్నికల్లో సత్తా చాటి తాము బలంగా ఉన్నామనే సంకేతం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ లో కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో ముందుండి.. ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోస ంప్రధాన పార్టీలన్ని తమ బలగాలను మోహరించాయి. అయితే హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానంలో పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంటిలిజెన్స్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లా పరిధిలో బీజేపీకి సానుకూలత ఉండగా.. మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ కొంత ముందుండే అవకాశం ఉంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. ప్రతి 60 మంది ఓటర్లకో ఇంచార్జ్ ను నియమించింది. పార్టీ పెద్దల ఆదేశాలతో గులాబీ నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు. దీంతో పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ కొంత పుంజుకుందని తెలుస్తోంది. వాణిదేవి మహబూబ్ నగర్ జిల్లా కోడలు కావడం కూడా ఆమెకు అక్కడ కలిసి వస్తుందని చెబుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి ఓటర్లలో మంచి అభిప్రాయమే ఉంది. విద్యాధికుడు, సౌమ్యుడు అయిన చిన్నా రెడ్డి గురించి ఉద్యోగులు, నిరుద్యోగులు సానుకూలంగా చెబుతున్నారు. అయితే అధికార పార్టీని ఓడించాలనే కసితో ఉన్న పట్టభద్రులు... గెలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకంగా ఉన్న నిరుద్యోగులు.. తమ ఓట్లు చీలకుండా ఒకరికే ఓటు వేయాలని నిర్ణయించుకోవడంతో.. చిన్నారెడ్డి రేసులో వెనకబడిపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకే చెందిన హర్షవర్ధన్ రెడ్డి కూడా పోటీలో ఉండటం చిన్నారెడ్డికి ఇబ్బందిగా మారింది. నిజానికి హైదరాబాద్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో దివంగత ప్రధాని పీవీ నరసింహరావు కూతురు వాణిదేవిని రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్.
ఇక నల్గొండ-వరంగల్- ఖమ్మం సీటులో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు వెనకబడి పోగా... టీజేఎస్ అధినేత కోదండరామ్, తీన్మార్ మల్లన్న మధ్యే హోరాహోరీ పోరు సాగుతుందని తెలుస్తోంది. కొంత కాలంగా కేసీఆర్ సర్కార్ పై పోరాడుతున్నారు తీన్మార్ మలన్న. ఆయనపై ప్రభుత్వం కొన్ని కేసులు కూడా పెట్టింది. అయినా బెదరకుండా ముందుకు పోతున్నారు మల్లన్న. దీంతో యూత్ లో మల్లన్నపై ఫుల్ క్రేజీ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్నే రేసులో దూసుకుపోతున్నారని తెలుస్తోంది. నిఘా వర్గాల సర్వే ప్రకారం యువ ఓటర్లు ఎక్కువగా మల్లన్నకు మద్దతుగా నిలుస్తుండగా.. ఉద్యోగుల్లో కోదండరామ్ పై సానుకూలత కనిపిస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమ నేతగా కోదండరామ్ పై అభిమానం చూపిస్తున్న పట్టభద్రులు.. దాన్ని ఓటు రూపంలో మలుస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. కోదండరామ్ కు ఉద్యోగుల ఓట్లు ఏకపక్షంగా పడితే తప్ప.. మల్లన్న గెలుపు ఖాయమనే చర్చ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరుగుతోంది.
నల్గొండ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందే చేతులెత్తేశారని చెబుతున్నారు. తనకు ఇష్టం లేకపోయినా... హైకమాండ్ బలవంతం మీద పోటీ చేస్తున్నారు పల్లా. ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్లినా స్పందనే కనిపించడం లేదట. పార్టీ నేతలు కూడా పట్టించుకోవడం లేదట. దీంతో పరిస్థితిని గ్రహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ముందే పలాయనం చిత్తగించారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రచారంలో ఏమాత్రం ప్రభావం చూపించడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా రాములు నాయక్ బరిలో ఉన్నా... టీఆర్ఎస్ ను ఓడించాలనే కసితో పట్టభద్రులంతా కోదండరామ్, మల్లన్న వైపే మొగ్గు చూపుతున్నారని .. హస్తం పార్టీ నేతలే అఫ్ ది రికార్డుగా చెప్పుకుంటున్నారు.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ సీటులో ఓటర్ల నుంచి తమకు తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. అధికార పార్టీ నేతలు మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలమైన కారణం ఉందంటున్నారు. ఈ ఎమ్మెల్సీ పరిధిలోనూ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అధికార పార్టీ నేతలు భారీగా బోగస్ ఓటర్లను నమోదు చేయించారని తెలుస్తోంది. ఒక్క మేడ్చల్ జిల్లా పరిధిలోనే మంత్రి మల్లారెడ్డి కాలేజీల కేంద్రంగా దాదాపు 50 వేల బోగస్ ఓట్లు ఎన్ రోల్ అయ్యాయని చెబుతున్నారు. హైదరాబాద్ ఓల్ట్ సిటీలో భారీగా ఫేక్ ఓటర్లు ఉన్నారంటున్నారు. అందుకే పట్టభద్రులు, ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నా.. బోగస్ ఓట్లతో గెలుస్తామనే ధీమాలో గులాబీ పార్టీ నేతలు ఉన్నారంటున్నారు.
పట్టభద్రుల స్థానాల్లో తమకు ఎదురుగాలి వీస్తుండటంతో.. ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ కుట్రలకు ప్లాన్ చేస్తుందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. పోలింగ్ రోజుల దొంగ ఓట్లు వేయించేందుకు ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించిందని చెబుతున్నారు. తాము ముందే నమోదు చేయించిన బోగస్ ఓట్లు వేయడంతో పాటు.. ఓటింగ్ కు హాజరు కాని పట్టభద్రుల ఓట్లను చివరి రెండు గంటల్లో ఫేక్ ఓటర్లతో వేయించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయాలని విపక్ష పార్టీలు, మండలి బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కోరుతున్నారు.