సాగర్ లో టైంపాస్ పాలి..ట్రిక్స్
posted on Mar 26, 2021 @ 11:58AM
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి 30వ తేదీ వరకు గడువున్నా.. ఇందులో మూడు రోజులు సెలవులున్నాయి. అంటే మంగళవారం మాత్రమే నామినేషన్ వేసేందుకు అవకాశం. అయినా ఇంతవరకు కాంగ్రెస్ క్యాండిడేట్ గా జానా రెడ్డి మాత్రమే ఖరారయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ సస్పెన్స్ కొనసాగిస్తుండగా... టీఆర్ఎస్ తర్వాతే మేమంటూ కమలనాదులు వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.
దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బిగ్ షాకిచ్చిన కమలదళం..అదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. హైదరాబాద్ స్థానంలో టీఆర్ఎస్‌తో హోరాహోరీగా తలపడినా.. నల్గొండ స్థానంలో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమయింది. దీంతో నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో సత్తా చాటి.. టీఆర్ఎస్‌కు మరో షాక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే.. తమ అభ్యర్థిని ప్రకటించాలని కమలం నేతలు యోచిస్తున్నారు. టీఆర్ఎస్ ఏ సామాజికవర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తుంది? నియోజకవర్గంలో అతడు ఏ మేరకు ప్రభావం చూపుతాడు? అని అంచనా వేసి.. ఆ తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించిన భంగపడిన నేతలకు గాలం వేసేందుకు కమలదళం కాచుకుని కూర్చుందని చెబుతున్నారు. సాగర్ నియోజకవర్గానికి చెందిన కొందరు గులాబీ నేతలతో బీజేపీ పెద్దలు టచ్ లో ఉన్నారని సమాచారం.
బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేసీఆర్ కూడా.. వాళ్లకు కౌంటర్ ప్లాన్ అమలు చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో ఆయన పక్కాగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటిస్తారని.. నేరుగా నామినేషన్ దాఖలు చేయిస్తారని సమాచారం. తద్వారా టీఆర్ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లకుండా అడ్డుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే టీఆర్ఎస్ అసంతృప్త నేతలను బీజేపీ చేరదీసి.. టికెట్ ఇచ్చే అవకాశముందని. అదే జరిగితే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అందుకే అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారని తెలంగాణలో చర్చ జరుగుతోంది. గతంలో పెద్దపల్లిలో ఇదే వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అనుసరించారు.
నామినేషన్లు గడువు ముగింపు దగ్గరపడుతున్నా అభ్యర్తులను ఖరారు చేయకపోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. టికెట్ రేసులో ఉన్న అభ్యర్తులైతే తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. ఆయా పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, లోకల్ నాయకుడు గురువయ్య యాదవ్ లో ఒకరికి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. బీజేపీ టికెట్ రవినాయక్ కు దాదాపుగా ఖరారైందని, చివరి నిమిషంలో టీఆర్ఎస్ నుంచి ఎవరైనా కీలక నేత వస్తే మారవచ్చని చెబుతున్నారు.