హస్తంలో గులాబీ ముళ్ళు
posted on Mar 4, 2014 @ 7:17PM
సీమాంధ్రలో పూర్తిగా మునిగిపోయిన హస్తం పార్టీ వారు గులాబీ కారుకి లిఫ్ట్ కోరుతూ హస్తం చూపించారు. కారు ఆపి ఎక్కించుకొంటే, వెనుక సీటులో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ తెలంగాణలో షికారు చేద్దామని ఊహల్లో తేలిపోయింది. కానీ కారు ఆగలేదు. పోతూ పోతూ... (పొత్తుల) స్టీరింగ్ నా చేతుల్లో లేదు...మీ కేశవన్న కమిటీయే స్టీరింగ్ తిప్పుతోంది...సారీ...అంటూ కాంగ్రెస్ కంట్లో దుమ్ముకొట్టి రివ్వున ముందుకు దూసుకుపోయింది గులాబీ కారు.
“మా బంగారు తల్లి సోనియమ్మ మా దేవత” అంటూ ఫ్యామిలీతో సహా గ్రూప్ ఫోటోలు దిగిన గులాబీ బాస్ అందరికీ హ్యాండ్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి హ్యాండివడమే కాకుండా మళ్ళీ “కాంగ్రెస్ పార్టీయే మాకు హ్యాండిచ్చింది” అని సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు “ఇప్పటికీ మా హ్యాండ్ మీ హ్యాండ్స్ లోనే ఉన్నాయని” చాలా ఏమ్మోషనల్ అయిపోతూ జవాబిచ్చారు. షబ్బీర్ అలీ అయితే ఉక్రోషం పట్టలేక కెసిఆర్ పిట్టలదొర అని నోరుజారేసారు కూడా.
అయినా హస్తాలు కాలాక పొత్తులు పట్టుకుంటే మాత్రం ఏమి లాభం? అని కాంగ్రెస్ నేతలు మేకపోతుని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కడుపులో నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఉగ్గబట్టుకొనేందుకు ‘ఇక తెరాసతో చేడుగుడే’ అంటూ కాంగ్రెస్ కండువాలు నడుంకి బిగించి పోటీకి సై అంటూ తమ ముసలి తొడలు ‘టపీ టపీమని’ సోనియమ్మకు వినబడేలా చరుచుకొన్నారు టీ-కాంగ్రెస్ నేతలు.
సోనియమ్మ కూడా వారిని డిల్లీకి పిలిచి టీ-పార్టీ ఇచ్చి “వాళ్ళకి తెలంగాణా ఉంటే, మీతో కలిసి పోరాడేందుకు అనేక ఎన్నికలలో పార్టీకి శల్యసారధ్యం చేసిన మన యువరాజు ఉన్నాడు. అదైర్య పడకండి” అని ఓదార్చారు.