దుబ్బాకలో గెలుపెవరది! హరీష్ రావు భవిష్యత్ ఏంటీ?
posted on Nov 5, 2020 @ 1:54PM
తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ పుట్టించిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినా.. ఆ సెగ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. హోరాహోరీ పోరు సాగిన దుబ్బాకలో ఎవరూ గెలుస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా భిన్న అంచనాలు ప్రకటించడంతో.. దుబ్బాకలో ఎవరూ గెలుస్తారో ఎవరు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే ఇప్పుడు దుబ్బాకలో గెలుపెవరది అన్న అంశంతో పాటు మంత్రి హరీష్ రావు భవిష్యత్ ఏంటన్న దానిపై కూడా జోరుగా చర్చ జరుగుతోందని తెలుస్తోంది. దుబ్బాక ఫలితాన్ని భట్టే ట్రుబుల్ షూటర్ ఫ్యూచర్ అధారపడి ఉందంటున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక కేంద్రంగా మంత్రి హరీష్ రావుపై కుట్రలు జరిగాయని, ఆయన మెడపై కత్తి పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీనే హరీష్ ను టార్గెట్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక బైపోల్ బాధ్యతలన్ని హరీష్ రావే చూశారు. అక్కడ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది. దీంతో దుబ్బాకలో వ్యతిరేక ఫలితం వస్తే.. ఆ నెపమంతా హరీష్ రావుకు అంటగట్టే కుట్ర జరుగుతుందనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దుబ్బాకలో పార్టీ గెలిస్తే కేసీఆర్ సంక్షేమ పథకాలే కలిసివచ్చాయని చెప్పడం.. ఓడిపోతే హరీష్ రావు బాధ్యుడిని చేసేలా గులాబీలోకుట్ర జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
గులాబీ ప్లాన్ లో భాగంగానే పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిసినా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ నేతలెవరు వెళ్లలేదని హరీష్ అనుచరులు చెబుతున్నారు. హరీష్ రావును ఇరికించే ప్రయత్నం దుబ్బాక ఉప ఎన్నిక సాక్షిగా జరుగుతుందని వారంతా బలంగా వాదిస్తున్నారు. టీఆర్ఎస్ లో మొదటి నుంచి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఎన్నికల్లోనూ సక్సెస్ చేసి చూపించారని చెబుతారు. అలాంటి ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ కలిగేలా టీఆర్ఎస్ లోని ఓ వర్గం ప్లాన్ చేసిందనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి దుబ్బాక ఉప ఎన్నిక అధికార పార్టీకి సవాల్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్మాత్మకంగా తీసుకోవడంతో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ తరపున ఆ పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లంతా ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ బండి సంజయ్ ముమ్మర ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రచారానికి పీసీసీ పెద్దలంతా వచ్చారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమ ప్రచారంలో కేసీఆర్ తో హరీష్ రావును తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. అయినా హరీష్ కు మద్దతుగా గులాబీ ముఖ్య నేతలెవరు దుబ్బాకకు వెళ్లలేదు. దీంతో దుబ్బాకలో ఒంటరి పోరాటం చేశారు హరీష్ రావు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ దుబ్బాకను సీరియస్ గా తీసుకోవాలి. కాని ఆయన మాత్రం పట్టించుకోలేదు. డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న జీహెచ్ఎంసీ, మరో ఆరు నెలల తర్వాత జరగనున్న మడలి ఎన్నికలపై వరుస సమీక్షలు చేసిన కేటీఆర్.. ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకపోవడం ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని తెలుస్తున్నా కేటీఆర్. కవిత, ఎంపీ సంతోష్ దుబ్బాకలో ఎందుకు ప్రచారం చేయలేదన్నది రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. పాలనలో మాార్పులు ఉంటాయని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని ఇప్పటిేకే ప్రచారం ఉంది. కేటీఆర్ కు రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తారని, కవితను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కు చెక్ పెట్టి ఆ ప్లేస్ ను కవితతో భర్తీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చర్చలు, ప్రచారాలకు అనుగుణంగానే దుబ్బాకలో పరిణామాలు జరిగాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దుబ్బాకలో ఒంటరి పోరాటం చేసిన మంత్రి హరీష్ రావు పోలింగ్ తర్వాత కొంత ఢీలా పడినట్లుగా కనిపించారు. మీడియాతో ఆయన మాట్లాడిన సమయంలోనూ ఆయన యాక్టివ్ గా లేరు. పోలింగ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఫేక్ ప్రచారంతో బీజేపీ నేతలు ఓటర్లను గందరగోళానికి గురి చేశారని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారని అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు. హరీష్ రావు కామెంట్లను బట్టి పోలింగ్ అధికార పార్టీ అనుకున్నతంగా జరగలేదని తెలుస్తోంది. పార్టీ నేతల తీరుపైనా హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కొందరు నేతలు కీలక టైంలో హ్యాండిచ్చారని కూడా మంత్రి చెబుతున్నారట.
మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పడమే కాక టీఆర్ఎస్ లోనూ కీలకంగా మారే అవకాశం ఉంది. దుబ్బాకలో కారు గెలిస్తే మంత్రి హరీష్ రావుకు గ్రాఫ్ మరింత పెరుగుతుందంటున్నారు. ఓడిపోతే మాత్రం ఆయనకు ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. అయితే హరీష్ రావు అనుచరులు మాత్రం దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హరీష్ రావు అభిమన్యుడులా వెలిగిపోతారని చెబుతున్నారు.