ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి
posted on Oct 30, 2023 @ 10:36AM
ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కరెంటు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. దీంతో ప్రమాద తీవ్రత వెంటనే తెలియరాలేదు. విశాఖ నుంచి పలాస వెళుతున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.
కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉండగా, దానిని అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ ను ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. విశాఖపట్టణంలోని కేజీహెచ్, విమ్స్‌లో వైద్య బృందాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. విశాఖపట్టణం నుంచి ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు పంపించారు. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లు రద్దు చేసింది. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.