బావిలో విషవాయువులు.. మధ్య ప్రదేశ్ లో ఎనిమిది మంది మృతి

పూడిక తీయడానికి బావిలోకి దిగి అందులోని విషవాయువుల కారణంగా ఎనిమిది మంది మరణించిన సంఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని కొండావత్ గ్రామంలోని పురాతన బావిలో బురద పేరుకుపోవడంతో దానిని శుభ్రం చేయాలని జిల్లాయంత్రాంగం భావించింది. ఈ బావి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. అది ఇప్పుడు వాడుకలో లేదు.

అయితే గంగౌర్ పండుగ నేపథ్యంలో విగ్రహ నిమజ్జనానికి ఆ బావిని వినియోగించాలని భావించిన గ్రామస్తులు ఆ బావిని శుభ్రపరచాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు గురువారం బావి శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ఓ ఐదుగురు బావిలోకి దిగారు. అందులోని విషవాయువులు పీల్చి స్ఫృహ కోల్పోయారు. వారిని రక్షించేందుకు మరో ముగ్గురు బావిలోకి దిగారు. వారు కూడా విషవాయువుల కారణంగా స్ఫృహ కోల్పోయి బావిలోని బురదలో కూరుకుపోయారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందీ మరణించారు.  

సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం  నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బావి పూడిక తీత కార్యక్రమంలో ఎనిమిది మంది మరణించిన సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆ పురాతన బావిని వెంటనే మూసివేయాలని ఆదేశించారు. 

Teluguone gnews banner