మళ్లీ తెరపైకి నిర్మాత సి కల్యాణ్ భూకబ్జా ! బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత
posted on Dec 30, 2020 @ 2:42PM
హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్ పేటకు సంబంధించిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ భూ కబ్జా వివాదం మళ్లీ ముదురుతోంది. పేదల భూములను కల్యాణ్ అక్రమించారంటూ భూ నిర్వాసితులు చందానగర్ మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్ ను ముట్టడించారు. పేదలను తరిమేసి భూములను ఆక్రమించుకున్న బడా నిర్మాత.. ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టారంటూ ఆందోళనకు దిగారు. కబ్జా స్థలంలో నిర్మాణాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని చందానగన్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. నిర్మాత సి కల్యాణ్ తో పాటు సర్కార్ కు వ్యతిరేకంగా హఫీజ్ పేట నిర్వాసితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చందానగర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట గ్రామంలో సర్వే నంబర్ 80లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ కబ్జా చేశారని 2017లో వెలుగులోనికి వచ్చింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. సర్వే నంబర్ 80లో మొత్తం 484.31 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ దాదాపు వెయ్యి మంది పేదలు గుడిసెలు వేసుకుని నివసించేవారు. రికార్డుల ప్రకారం ఈ భూమి ప్రభుత్వానిదే అయినా.. తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నది సీ కల్యాణ్ పై ఆరోపణ. 2006 ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి రంగారెడ్డి ఎస్ ఆర్ ఏ వో ఈ భూమిని సి కల్యాణ్ కు రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఈ భూమిని యూకో బ్యాంక్ కు ఐదు కోట్ల రూపాయలకు తనఖా పెట్టారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అప్పు కట్టకపోవడంతో బ్యాంకు వాళ్లు కల్యాణ్ కు నోటీసులు కూడా ఇచ్చారు. అదే సమయంలో 8 ఎకరాల భూమిని 80 ఎకరాలుగా పత్రాల్లో చూపించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే యూకో బ్యాంకుతో వన్ టైమ్ సెటిల్ మెంట్ చేసుకున్న సీ కల్యాణ్ ఈ భూమిని విడుదల చేయించుకున్నాడు.
తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను గతంలో ఖండించారు సి కల్యాణ్. తాను ఎవరి భూములను ఆక్రమించలేదని చెప్పారు. అయితే మూడేండ్ల కిందట దుమారం రేపిన భూ వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వివాదాస్పద భూమిలో నిర్మాత సి కల్యాణ్ నిర్మాణాలు చేపట్టడంతో బాధిత నిర్వాసితులు చందా నగర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారని చెబుతున్నారు. 2017లో కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలతో సి కల్యాణ్ రాజీ కొచ్చారనే నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.