జ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయదే!
posted on Aug 12, 2017 @ 3:04PM
ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే! ఏదన్నా జబ్బు చేసినప్పుడు అస్సలు ఆకలి వేయనే వేయదు. కంటి ముందు నోరూరించే పదార్థాలు ఎన్ని ఉన్నా, వాటిని తినాలన్న కోరికా ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడన్నా ఆలోచించారా?
ఒంట్లో జ్వరంలాంటి సమస్య ఉన్నప్పుడు ఆకలి వేయకపోవడానికి కారణం ఉందంటారు మన పెద్దలు. శరీరం తనని తాను బాగుపర్చుకునే క్రమంలో ఆహారం తీసుకునేందుకు ఇష్టపడదని చెబుతారు. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు చాలా శక్తి కావల్సి వస్తుంది. కానీ కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఈ శక్తి అంతా రోగకణాల మీద పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
పెద్దలు చెప్పిన మాటలలో కొంత నిజం లేకపోలేదంటారు శాస్త్రవేత్తలు. అయితే ఈ ఉపవాసం వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయంటున్నారు.
- ఒంట్లో రోగకణాలు ఉన్నప్పుడు, వాటిని ఎదుర్కొనేందుకు శరీరం cytokines అనే పదార్థాలని విడుదల చేస్తుంది. ఈ cytokinesతో అటు రోగనిరోధక శక్తి బలపడటంతో పాటుగా, ఇటు ఆకలి కూడా తగ్గిపోతుంట.
- జలుబు, దగ్గులాంటి సమస్యలు వచ్చినప్పుడు వాసన తెలియదు. ఆకలికీ వాసనకీ మధ్య సంబంధం తెలియంది కాదు కదా! ఏ వాసనా ఎరగకపోవడం వల్ల తినాలని అనిపించదు.
- చాలారకాల రోగాలకి మన ఒంట్లోకి చేరుకునే చెడు బ్యాక్టీరియానే కారణం. ఒంట్లో గ్లూకోజ్ బాగా ఉంటే... ఈ బ్యాక్టీరియా హాయిగా బలపడుతుంది. ఆ గ్లూకోజ్ మన ఆహారం ద్వారానే అందుతుంది. కడుపు ఖాళీగా ఉంటే, ఒంట్లో గ్లూకోజ్ నిల్వలు తగ్గిపోతాయి. ఫలితం బ్యాక్టీరియా కూడా బలహీనపడిపోతుంది. అయితే ఈ చిట్కా వైరస్‌ల వల్ల వ్యాపించే రోగాలకి వర్తించదు.
ఒంట్లో బాగోలేనప్పుడు ఆకలి వేయకపోవడం మంచిదే అని తేలిపోయింది. అయితే ఆ సమయంలో తగినంత నీరు తీసుకుంటూ ఉండాలనీ, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలని సూచిస్తున్నారు. లేకపోతే శరీరం మరింతగా నీరసించిపోయి సరికొత్త సమస్యలు మొదలవుతాయి.
చిన్నాచితకా రోగాలలో ఆకలి లేకపోవడం వల్ల లాభమే కానీ నష్టం లేకపోవచ్చు. కానీ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులలో ఇది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు ఆహారం తీసుకోకపోవడం వల్ల మనిషి త్వరగా మృత్యుముఖానికి చేరుకుంటాడు. అందుకనే ఇప్పుడు రోగసమయంలో ఆకలి తగ్గకుండా చూసేందుకు ఓ చికిత్సను కనుగొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. శరీరం జబ్బు పడినప్పుడు interleukin 18 (IL-18) అనే కణాలు ఆకలి వేయకుండా చేస్తున్నాయని గుర్తించారు. మందుల ద్వారా ఈ IL-18 కణాలను నియంత్రించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
- నిర్జర.