తిరుమలలో తిరుప్పావై
posted on Dec 16, 2022 @ 12:14PM
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానుండటంతో డిసెంబరు 17 నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2023 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పాపై పారాయణం జరుగుతుంది. పవిత్ర ధనుర్మాసం సందర్బంగా డిసెంబరు 17 నుండి 2023 జనవరి 14వ తేదీ వరకు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేయనున్నారు. కాగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యులు 900 సంవత్సరాల క్రితం తిరుమలలో పెద్దజీయర్ మఠం ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి సమక్షంలో శ్రీ పెద్ద జీయ్యంగారు మఠంలో నెల రోజుల పాటు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వెలసి ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఇటు గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని టీటీడీ ఆదేశించింది. బంగారు తాపడానికి సంబంధించి జరుగుతున్న పనులను జేఈవో పరిశీలించారు. 50 మంది స్వర్ణకారులు బంగారు తాపడం పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. స్వర్ణకారులకు అవసరమైన వర్క్ షాప్ లను మరిన్ని ఏర్పాటు చేయాలని జేఈవో సీఈని ఆదేశించారు. ఇక్కడ ఉన్న కార్యాలయ గదిని మరోచోటికి మార్చి ఆ స్థలంలో కూడా వర్క్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం ఐదు వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం ద్వారా పనుల వేగం పెంచవచ్చు అన్నారు.
వివిధ దశల్లో జరుగుతున్న బంగారు తాపడం పనులను ఆయన పరిశీలించి, ఈ పనుల్లో నిమగ్నమైన వారితో మాట్లాడారు. బంగారు తాపడం పనులను భక్తిశ్రద్ధలతో చేయాలని జేఈవో వారికి సూచించారు. అనంతరం పాత హుజూర్ ఆఫీస్‌లో ఖాళీగా ఉన్న గదులను పరిశీలించారు. వీటికి అవసరమైన మరమత్తులు చేసి ఉపయోగంలోకి తేవాలని సీఈని ఆదేశించారు. రాగి ,ఇత్తడి సామగ్రి పరికరాలు ఉంచే గదిని జేఈవో పరిశీలించారు. పంచలోహ విగ్రహాల తయారీ విభాగాన్ని పరిశీలించారు. ఈ విభాగం గది మరింత విశాలంగా ఉండి గాలి వెలుతురు బాగా వచ్చేలా మార్పులు చేయాలన్నారు.