భర్తతో ఎప్పుడూ గొడవలేనా? ఈ చిట్కాలతో బంధం పదిలం..!
posted on Oct 4, 2025 @ 12:44PM
జీవితంలో భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది. అలాగే కీలకమైనది కూడా. ఇరువురి జీవితాలను మలుపు తిప్పేది వివాహ బంధమే.. అయితే.. భార్యాభర్తల బందం ముడిపడినంత సులువుగా నిలబడదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. అయితే అసలు గొడవలు లేకపోతే బంధం పదిలంగా ఉంటుంది కదా.. చాలా వరకు భార్యాభర్తల బంధంలో గొడవలు వస్తూ ఉంటాయి. భర్తతో పదే పదే గొడవలు జరుగుతున్నాయని భార్యలు వాపోతుంటారు. ఈ గొడవలు తారాస్థాయికి చేరితే బంధమే ప్రశ్నార్థకమవుతుంది. అయితే ఎప్పుడూ భర్తతో గొడవలు జరుగుతున్న వారికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు. వారు చెప్పిన చిట్కాలు పాటిస్తే భార్యాభర్తల బందం పదిలంగా ఉంటుందట. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
ప్రశాంతంగా మాట్లాడాలి..
కోపంగా మాట్లాడటం మానుకోవాలి ప్రశాంతంగా మాట్లాడాలి.గొడవ సమయంలో వెంటనే రియాక్ట్ కాకూడదు. దీని వల్ల సంబంధం మరింత క్లిష్టమవుతుంది. లోతైన శ్వాస తీసుకోవాలి. గొడవ జరిగేటప్పుడు, గొడవ జరిగిన వెంటనే కూడా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి. ఆ తరువాతే సమస్య గురించి చర్చించాలి.
ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి..
ఒకరు చెప్పేది ఒకరు వినడం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గొడవలు జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి తప్పదు అనే పిచ్చి లాజిక్ లు పెట్టుకుని వెంటనే ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నించవద్దు. గొడవలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ల వెర్షన్ లోనే మాట్లాడుతూ ఉంటారు. ఈ కారణంగానే బంధాలు విఫలం అవుతాయి. అందుకే గొడవలు జరిగినప్పుడు భాగస్వామి బావాలు, తన అభిప్రాయాలు, ఉద్దేశ్యాలు అన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యం.
సమయం..
భార్యాభర్తలు ఇద్దరూ బంధం బలంగా ఉండాలన్నా, వారిద్దరూ సంతోషంగా ఉండాలన్నా నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఇలా చేయడం వల్ల సంబంధానికి కొత్త ఉత్సాహం వస్తుంది. పని , బాధ్యతలతో నిమగ్నమై ఉండటం వల్ల సంబంధంలో దూరం పెరుగుతుంది. భాగస్వామితో సమయం గడపాలి,మాట్లాడాలి,నవ్వాలి, అట్లాగే.. ఆనందించాలి.
సమస్యలు, పరిష్కారం..
సంబంధాన్ని సమస్యగా చూస్తే అది చాలా భారంగా, అలాగే మనుషులు అనవసరమైన వాళ్లుగా అనిపిస్తారు. అందుకే ఎప్పుడు కూడా భార్యాభర్తలు తమ బంధాన్ని సమస్యగా చూడకూడదు. ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం వెతకాలి. వివాదాలు సమస్యల వల్లే వస్తాయి. సమస్య వచ్చినప్పుడు గొడవ పడటం కాదు.. ఇద్దరూ కలిసి సమస్యను చర్చించి దానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఒకరిని ఒకరు నిందించుకోకూడదు.
క్షమాపణ ముఖ్యమే..
చిన్న చిన్న గొడవలకు క్షమాపణ అడగడం అస్సలు తప్పు కాదు. ప్రతి సంబంధంలోనూ అపార్థాలు వస్తుంటాయి. క్షమాపణ చెప్పడం వల్ల హృదయం తేలిక అవుతుంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచడానికి సహాయపడుతుంది.
అవగాహన..
ఇద్దరి మధ్య కేవలం ప్రేమ ఉంటే సరిపోదు.. అవగాహన కూడా ఉండాలి. ప్రేమ , అవగాహనతో బంధాన్ని బలంగా మార్చుకోవాలి. చిన్న చిన్న సంతోషాలు క్రియేట్ చేసుకోవాలి. ప్రేమగా మాట్లాడటం, సర్ప్రైజ్ చేయడం, చిన్న బహుమతులు ఇవ్వడం.. ఇవన్నీ పాజిటివ్ గా ఆలోచించి పాటిస్తే సాధ్యమే. వీటి వల్ల గొడవలు వచ్చినా తేలిపోతాయి.
*రూపశ్రీ.