తండ్రి కూతుళ్ల బంధం బలంగా ఉండాలంటే ఏం చెయ్యాలి?
posted on Jun 24, 2024 @ 9:30AM
సోషల్ మీడియాలో ఎక్కడైనా అమ్మాయిల పనులకు సంబంధించి కామెంట్లు వచ్చాయి అంటే అందులో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనే కామెంట్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి తండ్రికి తన కూతురు అంటే యువరాణితో సమానం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తండ్రులు కూతుళ్లను చాలా ప్రేమగా పెంచుతారు. కూతుళ్ల గురించి నెగిటివ్ ఆలోచన లేని కుటుంబంలో గమనిస్తే తండ్రులకు కూతుళ్లకు మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తండ్రి అందరికంటే ఎక్కువగా తన కూతురును ప్రేమిస్తాడు. చాలామంది తండ్రులు తన కూతురిలో తమ తల్లిని చూసుకుంటారు. తండ్రులు తమ తల్లుల దగ్గర పొందిన ప్రేమను, ఆప్యాయతను తమ కూతుళ్ల దగ్గర చూపిస్తుంటారు. ఇంటికి మహాలక్ష్మి లాగా కళ తీసుకొచ్చిందనే ఆలోచన కూడా తండ్రికి తమ కూతుళ్ల మీద ప్రేమ ఎక్కువ ఉండటానికి కారణం. అయితే తండ్రికి, కూతురికి మధ్య బంధం బలంగా మారాలంటే కింది పనులు చెయ్యాలి.
కూతుళ్లు జీవితంలో దైర్యంగా ముందుకు సాగడానికి తండ్రుల మార్గదర్శనం చాలా సహాయపడుతుంది. తన తండ్రి తనకు తోడు ఉన్నాడనే భరోసా కూతురిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తండ్రి నడవడిక, ప్రవర్తన, మనస్తత్వం ఆడపిల్లకు ప్రేరణ అవుతుంది. పురుష సమాజం పట్ల ఆడపిల్లలో గౌరవభావం కలగడానికి తండ్రి కారకుడు అవుతాడు.
తండ్రి మీద కూతురికి నమ్మకం ఎప్పుడూ నిలిచి ఉండాలంటే తండ్రి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. కూతురు ఆసక్తి చూపించే పనులలో తండ్రి కూడా పాలు పంచుకోవాలి. ఇలా చేస్తే కూతురికి, తండ్రికి మధ్య బంధం చాలా దృఢంగా మారుతుంది.
తండ్రులు గౌరవంగా, మంచి విలువలతో ప్రవర్తిస్తే కూతుళ్లు కూడా తమ ఆత్మగౌరవం, మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తండ్రి గౌరవాన్ని కాపాడే దిశగా ఆరోగ్యకరమైన మార్గాలలో అడుగులు వేస్తారు.
తండ్రులకు, కూతుళ్లకు మధ్య బంధం బలపడాలంటే ప్రతి తండ్రి తన కూతురి కలల పట్ల నిరాశ కలిగించకూడదు. కూతురి కల సాకారం అయ్యే దిశగా ప్రోత్సహించాలి. కూతురిని ముందడుగు వేయించాలి. అప్పుడు కూతురి విజయంలో తండ్రి పాత్ర చాలా ఉంటుంది. కూతురికి తన తండ్రి పట్ల గౌరవం పెరుగుతుంది.
*రూపశ్రీ.