మేడిపల్లిలో పండగ దొంగల బీభత్సం...12 ఇళ్లలో చోరీ
posted on Jan 16, 2026 @ 4:13PM
వీళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళు కాదురా బాబోయ్ దర్జాగా కార్లో వస్తారు... మెల్లిగా ఎటువంటి అలజడి లేకుండా పని మొత్తం ముగించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ కోసం పోలీసులు వేట కొనసాగించారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చాలామంది తమ స్వగ్రామా లకు వెళుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలోనే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకో వాలంటూ పలు సూచనలు చేశారు. కానీ చాలామంది అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా సంతోషంతో స్వగ్రామాలకు వెళుతూ ఉంటారు. కానీ ఇదే అవకాశం గా భావించే దొంగలు రెచ్చిపోతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.
మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదండోయ్... అర్ధరాత్రి సమయంలో ఒక్కరు కాలనీలోకి వచ్చి ఆగింది. కార్లో నుండి చాలామంది యువకులు బయటకు వచ్చారు. చేతిలో కత్తులు పట్టుకుని కాలనీలో సంచరిస్తూ వరుసగా 12 ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి... అనంతరం అర్ధరాత్రి సమయంలో కారులో దర్జాగా వచ్చి చోరీలు చేసి, అనంతరం వేగంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు.
సంక్రాంతి పండగ కారణంగా చాలా కుటుంబాలు వారి తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లిపోయారు. అలాంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకున్న దొంగలు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. కొందరు ఇళ్లలో అల్మారాలు, డ్రాయర్లు చెల్లాచెదురుగా పడివుం డటం చూసి ఉదయం చోరీ జరిగిన విషయం బయట పడింది. దొంగతనం జరిగిన విషయం తెలిసిన వెంటనే బాధితులు మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. అయితే కారులో వచ్చి దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌ను రప్పించారు.
ఫింగర్ ప్రింట్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దొంగల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో మొహానికి మాస్క్ , మరియు చేతిలో కత్తులు పట్టుకుని తిరుగుతున్న దొంగలను చూసిన స్థానికులు భయాం దోళనకు గురవుతున్నారు. పండగ రోజుల్లో గస్తీ పెంచాలని, రాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ సులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.