మద్యం కుంభకోణంలో మరో ముగ్గురు నిందితులు.. ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు
posted on May 7, 2025 @ 12:35PM
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో మంగళవారం (మే 6) మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొన్న సిట్ తాజాగా ఆ జాబితాలో జగన్ హయంలో పీఎంవో కార్యదర్శిగా పని చేసిన ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను చేర్చింది.
జగన్ హయాంలో దాదాపు 2600 కోట్ల రూపాయల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. ఈ కేసులో తాజాగా ముగ్గురిని చేర్చడంతో నిందితుల సంఖ్య 33 కు పెరిగింది. ఈ కేసులో వైసీపీకి చెందిన కీలక నేతలు, జగన్ హయాంలో కీలక స్థానాలలో పని చేసిన ఉన్నత స్థాయి అధికారులు నిందితులుగా ఉండటం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే సిట్ రాజ్ కేసిరెడ్డి, ఆయన సహాయకుడు సహా నలుగురిని అరెస్టు చేసింది. వారి రిమాండ్ రిపోర్టుల్లో కూడా సిట్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ప్రమేయం గురించి పేర్కొంది. ఈ ముగ్గురు సాక్ష్యులను, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కోర్టులను ఆశ్రయించినప్పటికీ అక్కడ వారికి చుక్కెదురైంది. సుప్రీం కోర్టు అయితే చట్ట ప్రకారం వారికి అరెస్టు చేయవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురినీ దర్యాప్తు అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.