డిప్రెషన్ తో బాధపడేవారికి ఈ ఆహారం ఔషధమే!
posted on May 5, 2023 @ 9:30AM
మనిషిని వేధించే సమస్యలలో మానసిక సమస్యలు చాలా ఘోరమైనవి. పని ఒత్తిడి, కరోనా సమస్య అనేక సామాజిక కారణాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు చాలా హానికరం. మానసిక ఆరోగ్య సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి ప్రాణాలమీదకు తెచ్చిపెడతాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లను సరిగ్గా ఉంచుకోవడం ద్వారా మానసిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పోషకాహారం మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరకంగానూ, మానసికంగానూ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నవారు కేవలం మందుల మీదనే ఆధారపడితే.. కొలుకోవడం కష్టం. రోజూ తీసుకునే ఆహారంలో ఈ కిందున్న వాటిని చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
తృణధాన్యాలు
తృణధాన్యాలు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తృణధాన్యాలలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, వివిధ రకాల పోషకాలలు కలిగి ఉంటాయి. తృణధాన్యాలు మెదడు ట్రిప్టోఫాన్‌ను గ్రహించడంలో సహాయపడతాయి. ఈ కారణంగా నిరాశ ఆందోళనను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే డిప్రెషన్ ను తగ్గించుకోవడం సుగమం అవుతుంది.
పాలకూర
పాలకూర , పచ్చి ఆకుకూరలు ఆరోగ్యానికి పోషకమైన ఆహారాలు. దీన్ని తీసుకోవడం ద్వారా, మెదడుకు తగినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది, ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యం కారణంగా నిద్రలేమి సమస్య ఉన్నవారు పాలకూర తినాలి. అధ్యయనం ప్రకారం, పాలకూరలో ఉండే సమ్మేళనాలు వృద్ధులలో చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్
మానసిక ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా ఉంటాయి. ఇది నిరాశతో పోరాడటానికి సహాయపడుతుంది. కొన్నింటిని పరిశీలిస్తే..
జీడిపప్పులో మెగ్నీషియం మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తుంది.
బాదంపప్పులో ఉండే ఫెనిలాలనైన్ అనే సమ్మేళనం మెదడుకు డోపమైన్ మరియు ఇతర న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది.
కాబట్టి పై పదార్థాలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే డిప్రెషన్ ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
◆నిశ్శబ్ద.