మూడు జనరేషన్ల బంధం బలంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయాలి..!
posted on Aug 22, 2025 @ 9:30AM
తల్లిదండ్రులు పిల్లలకు గైడ్లు, టీచర్లు, మార్గదర్శకులు. వారు పిల్లలకు ప్రేమపూర్వకమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వడం ద్వారా జీవితాన్ని ఆశాజనకంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య బంధం జనరేషన్ మారగానే బంధం కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది. పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు పుట్టిన తరువాత చాలామంది తమ తల్లిదండ్రులకు దూరంగా జరుగుతూ ఉంటారు. ఇది కావాలని చేసేది కాకపోయినా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మార్పులు జరుగుతాయి. చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, అవ్వ తాతలు.. ఇలా మూడు తరాల మధ్య బంధం బలంగా ఉంటే ఆ కుటుంబాలు చాలా గొప్ప సంపదను పోగేసుకున్నట్టే.. అయితే ఇలా మూడు తరాల బంధం బలంగా మారడానికి చేయాల్సిందేమిటి? తెలుసుకుంటే..
కృతజ్ఞత..
తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే వాటికి మాటల్లో థాంక్స్ చెబితే సరిపోదు. కానీ మానసికంగా బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి, భవిష్యత్ తరాలను పోషించడానికి ఇది ఒక మార్గం. కుటుంబంతో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు తల్లిదండ్రులతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం, కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. ఇది చూస్తే మీ పిల్లలు కూడా తమ అవ్వతాతలు ఎంత గొప్పవారు, వారిని గౌరవించాలి అనే విషయాన్ని నేర్చుకుంటారు. ఇది పెద్దవారి పట్ల పిల్లలలో మంచి అభిప్రాయం, మంచి నడవడికను పెంపొందిస్తుంది. పిల్లల ముందు ఎట్టి పరిస్థితులలోనూ పెద్దలను దూషించడం, గేళి చేసి మాట్లాడటం చేయరాదు.
పిల్లలు వారుకళ్లతో చూసే దాన్నే నేర్చుకుంటారు. తమ తల్లిదండ్రులు తమ పెద్దలను జాగ్రత్తగా చూసుకోడం, గౌరవించడం వంటివి చేస్తే పిల్లలు కూడా కరుణ, సున్నితత్వం వంటివి నేర్చుకుంటారు. పెద్దలను చూసుకోవడం తమ భాద్యత అనే భావాన్ని మనసులో పెంపొందించుకుంటారు. ఇది పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రుల పట్ల మాత్రమే కాకుండా, సమాజంలోని ఇతరుల పట్ల కూడా పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది.
వృద్ధులకు సేవ చేయడం భారం కాదని.. సేవ అనేది ప్రేమ, కృతజ్ఞత చూపించే అవకాశం అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది పాఠశాల లేదా పుస్తకాల నుండి పిల్లలకు లభించే గుణం కాదు.. కేవలం తమ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారానే సాధ్యమవుతుంది. మందులు ఇవ్వడం, మాట్లాడటం, సమయం గడపడం వంటివి పిల్లల మనస్సుల్లో లోతైన ముద్ర వేస్తాయి. ఈ కారణంగానే పెద్దలకు ఏదైనా సేవ చేసేటప్పుడు తప్పనిసరిగా పిల్లలను కూడా వెంట ఉంచుకోవడం మంచిది.
తల్లిదండ్రులకు కూడా ప్రేమ అవసరం. తల్లిదండ్రుల కోసం ఏదైనా చేసినప్పుడు వారు చాలా సంతోషంగా ఉంటారు.చుట్టూ ఉన్న నలుగురికి తమ పిల్లలు తమకు ఏం చేశారు అనే విషయాన్ని చెప్పుకుని మరీ చాలా గర్వంగా ఫీలవుతూ సంతోషిస్తారు. అందుకే తల్లిదండ్రుల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అటు తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడమే కాకుండా.. ఇటు పిల్లలకు కూడా ఒక అభ్యసనం అవుతుంది. ఇది మూడు తరాల బంధాన్ని చాలా ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది.
*రూపశ్రీ