Read more!

ఇంట్రోవర్ట్ లను తక్కువ అంచనా వేయకండి.. వీళ్ల గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది.

ఇంట్రోవర్ట్ ల గురించి..

మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం..

కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు.

ఒంటరితనమే బలం..

మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది.

మానసికంగా దృఢంగా..

అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు.
తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు.


జ్ఞాపకశక్తి ఎక్కువ..

2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది.


ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.
 లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.

                                         *నిశ్శబ్ద.