పేరెంట్స్ జాగ్రత్త.. తండ్రిని చూసి పిల్లలు నేర్చుకునే అలవాట్లు ఇవీ.. !
posted on Nov 23, 2024 @ 10:03AM
పిల్లలకు తమ తండ్రే మొదటి హీరో.. సాధారణంగానే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. తల్లిదండ్రులు చేసే పనులను తాము కూడా అలవాటు చేసుకుంటారు. అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తుందని చెబుతారు. కానీ కొన్ని పనులు తండ్రులు మాత్రమే చేసేవి ఉంటాయి. వాటిని పిల్లలు కూడా నేర్చుకుంటారు. చిన్నతనంలో నేర్చుకునే కొన్ని విషయాలు పిల్లలు జీవితాంతం పాటించేవిగా ఉంటాయి. అలాంటి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుండి కూడా నేర్చుకుంటారు. ఇంతకీ పిల్లలు తండ్రి నుండి నేర్చుకునే అలవాట్లు ఏమిటి? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడున్నాయి.
గౌరవం..
ఇతరులను గౌరవించడం అనేది పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ముఖ్యంగా తండ్రి ప్రవర్తన ద్వారా ఇది పిల్లలకు ఎక్కువగా అలవడుతుంది. ఎందుకంటే ఇంటి పెద్దగా తండ్రిని భావిస్తారు. బయటి వారి నుండి పెద్దలు, కుటుంబ సభ్యులు, చివరకు భార్య, పిల్లలను గౌరవించడం అనేది కూడా అతను చేయాల్సిందే.. ఒక మగవాడు ఇలా అందరినీ గౌరవిస్తూ ఉంటే అతని పిల్లలు కూడా గౌరవించడాన్ని నేర్చుకుంటారు. కానీ కొందరు మగవారు పురుషాహంకారంతో అసభ్యంగా, కఠినంగా, అవమానకరంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు.
ఆత్మవిశ్వాసం..
కుటుంబాన్ని తన భుజాల మీద మోసేది తండ్రి. తన భాద్యతగా భార్య, పిల్లలు, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వ్యక్తి అతనే.. కష్ట సమయాలలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం నుండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వరకు అతని ఆత్మవిశ్వాసమే పిల్లలకు ప్రేరణ అవుతుంది. పిల్లలు కూడా తమ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకుంటారు.
ఇతరుల మాట వినడం..
తను మగవాడు.. పైగా ఇంటికి పెద్ద.. ఇంటి బరువు భాద్యతలు మోస్తున్నవాడు.. అలాంటి వాడు ఇతరుల మాట వెంటే చిన్నతనమైపోతాడు అనే ఫీలింగ్ చాలా మంది మగవారికి ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు.. మొదట భార్య మాట, తల్లిదండ్రుల మాట తరువాత మంచి చెప్పే ఎవరి మాట అయినా వినాలి. ఇలా వినే స్వభావం అతనికి ఉంటే అతన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అతను ఎవ్వరిమాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా ఎవరి మాట వినకుండా నిర్లక్ష్యంగా తయారవుతారు.
శారీరక శ్రద్ద..
ఇప్పటి జీవనశైలిని అనుసరించి ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది శారీక కార్యకలాపాలలో భాగం కావాలి. ఇప్పట్లో శారీరక శ్రమ తక్కువ, మానసిక శ్రమ ఎక్కువ. కాబట్టి వీలు చూసుకుని శారీరక వ్యాయామం, నడక, ఫిట్ నెస్ కార్యాచరణలో నిమగ్నం అవ్వాలి. దీన్నిచూసి పిల్లలు కూడా శారీరక ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపిస్తారు. కుదిరితే పిల్లలతో కలసి ఫిట్‌నెస్ కార్యకలాపాలు కొనసాగించాలి.
ఇంటి పనులు..
కొంతమంది మగవారు ఈ పనులు ఆడవారే చెయ్యాలి.. ఈ పనులు మగవారే చెయ్యాలి అనే గీత గీసుకుని ఉంటారు. ఇంతకు ముందుకాలంలో ఉద్యోగం చేసే మహిళలు తక్కువ. కానీ ఇప్పటి కాలం మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఇంటి పనులు చక్కబెడుతుంటారు. మహిళలకు చేదోడుగా మగవారు కూడా పనులలో భాగస్వామ్యం అవుతుంటే దాన్ని చూసి పిల్లలు కూడా తల్లికి సహాయపడటం, ఇంటి పనులు చేయడం నేర్చుకుంటారు. భర్త పిల్లలు ఇంటి పనులలో సహాయపడితే ఏ భార్య అయినా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి ఇల్లు కూడా ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉంటుంది. పైగా పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. దీని వల్ల ఇంటిల్లిపాది కలసి సంతోషంగా గడపడానికి సమయం కూడా దొరుకుతుంది.
*రూపశ్రీ.