తలైవి.. రాజకీయ శివంగి..
posted on Mar 24, 2021 @ 4:54PM
'తలైవా' అంటే రజనీకాంత్ అని చాలామందికి తెలుసు. మరి, 'తలైవి' అంటే? "తలైవి" ఈ పేరు ఇప్పుడు కోలివుడ్ సిల్వర్ స్క్రీన్‌పై సంచలనం. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపణం. 'పురచ్చితలైవి'గా ఖ్యాతిగాంచిన జయలలిత పొలిటిక్ స్టోరీనే ఈ తలైవి సినిమా. ఏప్రిల్ 23న రిలీజ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విడుదల. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. తమిళ పాలిటిక్స్‌లో ప్రకంపణలు సృష్టిస్తోంది. 'అమ్మ'ను మరోసారి గుర్తు చేస్తోంది.
జస్ట్ 3 నిమిషాల ట్రైలర్. ఆడపులి జయలలిత రాజకీయ ప్రస్థానంలోని అనేక కోణాలను టచ్ చేస్తోంది. సినీ రంగం నుంచి సీఎం సీటు వరకూ జయ చేసిన పోరాటాన్ని, ఆరాటాన్ని, అవమానాన్ని, అందలాన్ని.. అన్నిటినీ టచ్ చేసింది తలైవి ట్రైలర్. ఈ మూడు నిమిషాలు.. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత పాలనను గుర్తుకు చేసింది. ఇక మూడు గంటల సినిమాలో.. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఎపిసోడ్ మొత్తం కళ్లకు కట్టడం ఖాయం.
కంగనా రనౌత్. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. జయలలిత లీడ్ రోల్‌లో రచ్చ రచ్చ చేసింది. ఫిజికల్ పర్సనాలిటీలో సరిపోలక పోయినా.. ఆటిట్యూడ్, అగ్రెసివ్‌నెస్‌లో అచ్చం అచ్చు గుద్దినట్టు జయలలితను గుర్తు చేసింది. ఆనాడు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయలలితకు జరిగిన దుశ్శాసన పర్వాన్ని మరోసారి ఈ తరం ప్రేక్షకుల ముందు సాక్షాత్కరింపజేశారు. అసెంబ్లీలో జయలలిత చీర లాగే సీన్‌లో కంగనా నటన అద్భుతం. ట్రైలర్‌లోనే ఆ సీన్ అంత బీభత్సంగా పండితే.. ఇక సినిమాలో మరింత సెన్సేషనలే. ఎమ్జీఆర్ అంతిమయాత్ర సమయంలో జయలలితకు జరిగిన అవమానాన్ని కూడా ట్రైలర్‌లో చూడొచ్చు. ఎమ్జీఆర్ పార్థీవదేహం దగ్గర నుంచి జయలలితను లాగి పారేసే ఘటన.. ట్రైలర్‌లో చూపించారు.
జయలలిత సినిమా కెరీర్.. ఎమ్జీఆర్‌తో సన్నిహితం, సాన్నిహితం.. ఏఐఏడీఎంకేలో ఎంట్రీ.. ఎమ్జీఆర్ మరణం.. సీఎంగా సంచలనం.. ఇలా జయలలిత జీవితంలోని అన్ని యాంగిల్స్‌తో ఫుల్లీ ప్యాక్డ్ పవర్‌ఫుల్ మూవీగా ఉండనుంది తలైవి. ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. "మహా భారతానికి మరో పేరు జయ" అనే డైలాగ్ అదుర్స్. "నన్ను అమ్మగా చూస్తే నా హృదయంలో మీకు చోటుంటుంది. నన్ను కేవలం ఒక ఆడదానిగా చూస్తే.." అనే ఇన్‌కంప్లీట్ డైలాగ్‌తో ట్రైలర్‌ను ఎండ్ చేయడం ట్రైలర్‌కే హైలైట్.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. ఈ టైమ్‌లో "తలైవి" ట్రైలర్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇది ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశముందని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. అధికార అన్నాడీఎంకేకి తలైవి అనుకూలం కానుంది. తమిళనాట ఏఐఏడీఎంకే, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటం.. బీజేపీ సానుభూతిపరురాలిగా ముద్ర ఉన్న కంగనా రనౌత్ నటించడం.. ఎన్నికల వేళ 'పురచ్చితలైవి'ని తమిళ ప్రజలకు గుర్తు చేసేలా కీలక సమయంలో తలైవి ట్రైలర్ రిలీజ్ చేయడం.. అంతా అధికార పార్టీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగమేనంటున్నారు విమర్శకులు. తలైవి.. జస్ట్ 3 నిమిషాల సినిమా ట్రైలరే అయినా.. అది జయలలిత జీవిత గాధ అవటం.. అది రిలీజ్ అయిన సమయం, సందర్భం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను విశేషంగా ప్రభావితం చేయనుంది. తలైవినా.. మజాకా...