బల పరీక్ష తప్పకపోతే రాత్రికే ఠాక్రే రాజీనామా?
posted on Jun 29, 2022 @ 2:54PM
మహారాష్ట్రలో ఎనిమిది రోజుల క్రితం మొదలైన రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. అయితే, అసెంబ్లీలో గవర్నర్ ఆదేశించిన విధంగా రేపు ( గురువారం) బల పరీక్ష జరిగితే, ఏమి జరుగుతుందో ముందే ఉహించిన, అధికార 'అఘాడీ' కూటమి, బలపరీక్ష నిరూపణను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ బలపరీక్ష నిరూపణను సవాల్ చేస్తూ.. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో, గవర్నర్ అదేశించిన విధంగా గురువారం (రేపు) అసెంబ్లీ బల నిరూపణ జరుగుతుందా లేదా అనే విషయంలో సందిగ్ధత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బుధవారం (ఈ రోజు) సాయంత్రం సునీల్ ప్రభు ప్రభు పిల్ పై సుప్రీం తీర్పు ఏమిటో తేలిపోతుంది.
అయితే, ఇప్పడు ప్రశ్న, బల పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అనేది కాదు, బల పరీక్ష ఎప్పుడు జరిగినా, మహా వికాస అఘాడీ (ఎంవీఎస్) ప్రభుత్వం, సభలో సంఖ్యా బలాన్ని నిరుపించుకుంటుందా? అందుకు అవసరమైన సంఖ్యా బలం కూటమికి వుందా? అంటే ఇప్పటికిప్పుడు ఉందని కానీ, లేదని కానీ, చెప్పే పరిస్థితి లేదు. అయితే, శివసేన తిరుగుబాటు వర్గం నేత ఏక్‌నాథ్ షిండే చెప్పు కుంటున్న విధంగా 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో సహా మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నదే నిజమైతే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పభుత్వం బల పరీక్షను నెగ్గుకు రావడం అయ్యే పనికాదని, మహారాష్ట్ర పరిణామాలను గమనిస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి, అసమ్మతి ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు తమ తో టచ్’లో ఉన్నారని, శాసన సభ బల పరీక్షలో గెలుస్తామని, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీమాగా ఉన్నా, బల పరీక్ష వాయిదాకు శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, సంఖ్యా బలం శివసేన వైపు లేదనే విషయం తేట తెల్లంగా తెలిసిపోతోందని, పరిశీలకులు అంటున్నారు. మరో వంక ఏక్‌నాథ్ షిండే వర్గం, అదే విధంగా షిండే వర్గంతో చేతులు కలిపిన బీజేపీ బల పరీక్షకు సిద్ధమవు తున్నాయి.
కాగా, బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ ఈరోజు (బుధవారం) సాయంత్రం లోపు ముంబయిలోని తాజ్ హోటల్ కు రావాలన్నదే ఆ ఆదేశం. మరోవంక ప్రస్తుతం గౌహతీలో ఉన్న శివసేన తిరుగుబాటు వర్గం నేత షిండే, గురువారం ఉదయం తమ వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ముంబయికి చేరుకుంటానని, అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్షలో పాల్గొంటామని వెల్లడించారు. అధికార మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది శాసన సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షం బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే షిండే తిరుగుబాటుతో.. ఆయన వెంట 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు స్వతంత్రులు షిండే వర్గంలో ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 287 మంది సభ్యులున్నారు.
ఈ నేపధ్యం,లో శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు 39 మంది. ఓటింగులో పాల్గొన్నా, పాల్గొనక పోయినా, అఘాడీ సర్కార్ కుప్ప కూలడం ఖాయమని, అంటున్నారు. శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొని విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే, బీజేపీ కూటమి బలం మెజారిటీ మార్క్ 144ను సునాయాసంగా దాటేస్తుంది. అలా కాదని, శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు 39 మంది. సభకు హాజరుకాకపోతే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248 కి తగ్గనుంది. ఈ క్రమంలో ఠాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమి ఉన్న సంఖ్యా బలం 113 మాత్రమే. ఈ పరిస్థితుల్లో బలపరీక్ష ఎదురైతే ఠాక్రే సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉందని, సో .. బల పరీక్ష జరిగితే, ప్రభుత్వం కూలిపోక తప్పదని అంటున్నారు. అందుకే, సుప్రీం కోర్టు బల పరీక్షకు పచ్చ జండా ఊపితే ... ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పడిపోవడం ఖాయమని, అదే జరిగితే ముందుగా, ఈ రాత్రికే ఠాక్రే రాజీనామా చేసినా చేస్తారని అంటున్నారు.