అమరావతే ఏపీ రాజధాని: తెలుగువన్ ఎండీ కంఠంనేని రవి శంకర్
posted on Sep 20, 2022 @ 6:14PM
అమరావతి రైతుల మహా పాదయాత్రలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ పాల్గొన్నారు. ఏపీకి ఒకటే రాజధాని అది అమరావతే అని నినదిస్తూ అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన పాదయాత్ర మంగళవారం తొమ్మిదో రోజు బాపట్ల జిల్లా రేపల్లె నుంచి మొదలై పెనుమూడి వారథి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.
ఈ సందర్బంగా కృష్ణా జిల్లాలోని పల్లె పల్లె నుంచీ జనం అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికారు. పెనుమూడి వారధి కింద కృష్ణానది ప్రవహిస్తుంటే.. వారథిపైనా ఆకుపచ్చ ప్రవాహం సాగుతోందా అన్నట్లుగా రైతుల పాదయాత్ర సాగింది. అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా జగన్ యావత్ రాష్ట్రాన్నీ అధోగతి పాలు చేశారనీ, ఈ విషయాన్ని రాష్ట్రప్రజలు గుర్తించారని రైతులు పేర్కొన్నారు. జగన్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా, అసత్య ప్రచారాలు చేసినా జనం మాత్రం అమరావతే రాజధాని కావాలని కోరుకుంటున్నారనీ, అందుకు తమ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనే నిదర్శనమని రైతులు పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలోకి రైతుల మహాపాదయాత్రకు స్వాగతం పలుకుతూ తెలుగువన్ ఎండీ కంఠంనేని రవి శంకర్ జగన్ ప్రభుత్వం తుగ్లక్ ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. కర్నాటక రాజధాని బెంగళూరు, తమిళనాడు రాజధాని చెన్నై ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనన్నారు. రైతుల మహాపాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.
ఈ పాదయాత్రలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో వచ్చారు. అవనిగడ్డ బార్ అసోసియేషన్ రైతుల పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటించింది.
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ప్రారంభించిన ఉద్యమం ఈ ఏడాది సెప్టెంబర్ 12వ తేదీతో వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలుతోపాటు అన్ని వర్గాల వారు ఈ మహా పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ మహా పాదయాత్ర... వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భాగవానుడి చెంతకు చేరనుంది. ఈ మహా పాదయాత్రకు అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.