తెలుగుదేశం జైత్రయాత్ర ఆరంభం!
posted on Jul 27, 2022 @ 12:40PM
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన జైత్ర యాత్ర మొదలెట్టింది. అధికార వైసీపీపై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను ఒక కోపరేటివ్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికలు బట్టబయలు చేశాయి. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఇలాకా కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలనూ తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టిన చందంగా హోంమంత్రి నియోజకవర్గంలో టీడీపీ సత్తా చాటింది. దీంతో కొవ్వూరులో టీడీపీ జెండాల రెపరెపలు మొదలయ్యాయి.
ఒక్క ఛాన్స్ అంటూ అధికార పగ్గాలు అందుకున్న జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని హీన స్థితికి తేవడమే కాకుండా వైసీపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు అగచాట్లు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త మీద కూడా పన్ను వేయడం లాంటి అనాలోచిత చర్యలతో వైసీపీ సర్కార్ పై జనంలో ఓ రేంజ్ లో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జరిగిన కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరేయడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఇదే తొలిమెట్టు అంటూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నిజానికి 1983 నుంచీ ఇక్కడ టీడీపీ హవాయే కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అంటూ కొంత కాలంగా విర్రవీగుతున్న వైసీపీ నేతల అత్యుత్సాహానికి కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికలు బ్రేకులు వేశాయని చెప్పాలి. కొవ్వూరు వైసీపీలో గ్రూపు రాజకీయాల కారణంగానే టీడీపీ విజయం సులువు అయిందని, తమకు ఓటమి ఎదురైందని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని బహిరంగంగా చెబుతుండడం గమనించదగ్గ విషయం. అయితే.. అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. జిల్లా సహకార అధికారికి వైసీపీ ఫిర్యాదు చేయడాన్ని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
కాగా.. కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక వర్గంపై దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే.. టీడీపీని ఈసారి ఎలాగైనా దెబ్బకొట్టాలనే కుట్రతో వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం విశేషం. నిజానికి వచ్చే ఆగస్టు 4తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగుస్తోంది. దీంతో సొసైటీల మాదిరిగా త్రిసభ్య కమిటీ వేసి అర్బన్ బ్యాంకును చేజిక్కించుకోవాలని అధికార పార్టీ వేసిన ఎత్తుగడను టీడీపీ నేతలు తిప్పికొట్టడం గమనార్హం. 1964 కో ఆపరేటివ్ సొసైటీ చట్టం 43 ప్రకారం ఎన్నికలు నిర్వహించుకుని, ఏకగ్రీవంగా ఎన్నికైన తదుపరి పాలకవర్గాన్ని ప్రకటించారు.
కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి హోం మంత్రి తానేటి వనితే కారణం అంటూ ఆ పార్టీ నేత కంఠమణి రమేష్ నిప్పులు చెరుగుతున్నారు. మంత్రిపై మనస్తాపంతో కొవ్వూరు శ్రీరామా ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు. దీంతో కొవ్వూరు నియోజకవర్గంలోని వైసీపీలో లుకలుకలు బట్టబయలయ్యాయి.