ఒడిషాలో తెలుగు విద్యార్ధి అనుమానాస్పద మృతి..
posted on Jul 13, 2016 @ 5:14PM
పొరుగు దేశాల్లో.. పొరుగు రాష్ట్రాల్లో తెలుగు విద్యార్ధులపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్ధి ఒడిషాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బొర్రపాలెంకు చెందిన వంశీ పర్లాకిమిడి సెంచరియన్ యూనివర్శిటీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వంశీకృష్ణ వర్శిటీ ప్రాంగణంలో శవమై కనిపించగా తోటి విద్యార్థులు గమనించి విశ్వవిద్యాలయం యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే విశ్వవిద్యాలయం యాజమాన్యం మాత్రం.. వంశీకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. కానీ తమ కుమారుడిది ముమ్మాటికి హత్యేనని తమ బిడ్డ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదక వస్తేకాని ఏ విషయం చెప్పలేమని చెబుతున్నారు.