బీజేపీని తెలుగువారు నమ్మడం లేదు!
posted on May 15, 2023 @ 11:02AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరించిందన్న భావన తెలుగువారిలో మరీ ముఖ్యంగా ఆంధ్రులలో చాలా బలంగా ఉంది. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవహరించిన తీరు.. ఉద్దేశపూర్వకంగా ఏపీకి, ఏపీ ప్రయోజనాలకూ భంగం వాటిల్లే విధంగానే ఉందన్నది ఆంధ్రుల నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తున్నది.
2019 ఎన్నికలలో ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా బీజేపీ విజయం సాధించకపోవడమే కాకుండా, పోటీ చేసిన ఏ స్థానంలోనూ కనీసం డిపాజిట్ కూడా దిక్కించుకోలేకపోయింది. ఆ తరువాత ఏపీలో జరిగిన రెండు ఉప ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీకి అప్పుడు కూడా కనీసం డిపాజిట్ దక్కలేదు. ఇక ఇప్పుడు తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూడా బీజేపీకి తెలుగువారి ఆగ్రహ జ్వాల సెగ గట్టిగానే తాకింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు అధికంగా ఉన్న ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగువారు స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు అక్కడి పరిశీలకులు చెబుతున్నారు.
2018లో జరిగిన కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయవద్దంటూ తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో గట్టిగా ప్రచారం చేసింది. అయితే తాజా ఎన్నికలలో మాత్రం తెలుగుదేశ పార్టీయే కాదు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. చివరాఖరికి బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న బీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయలేదు. ఆ రాష్ట్రంలో బీడీఎస్ కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ ఎక్కడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు. ఆ విషయాన్ని జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వయంగా చెప్పి బీఆర్ఎస్ అధినేతపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
ఇక కర్నాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉంటే ఎనిమిది జిల్లాల్లోని 49 స్థానాలలో బీజేపీ కేవలం ఆరు అంటే ఆరు స్థానాలలోనే విజయం సాధించడమే తెలుగు ప్రజలు బీజేపీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాలు సహా దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. దీనిని బట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారని తేలుతోంది. సరిహద్దు జిల్లాలైన కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ బళ్లారి జిల్లాలో బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా దక్కలేదు. ఇక మొత్తంగా తెలుగు వారి ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న జిల్లాలు కర్నాటకలో రమారమి 10 వరకూ ఉంటాయి. ఆ పది జిల్లాలలోనూ కలిపి బీజేపీ గులుచుకున్నవి 9 స్థానాలు మాత్రమే.