‘శ్రీ కృష్ణ’ నివేదిక ఇక అట కెక్కినట్లేనా?
posted on Dec 22, 2012 @ 12:57PM
తెలంగాణా ఫై శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ‘ముగిసిన అధ్యాయమని’, ఈ నెల 28 న జరిగే అఖిల పక్ష సమావేశం లో దానిఫై చర్చ జరగదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెపుతున్నాయి. షిండే కొత్తగా హోం మంత్రిగా భాద్యతలు చేపట్టడంతో, ఈ సమస్య ఫైన ఓ అవగాహన కల్పించుకోవడానికి మాత్రమే ఈ సమావేశం పరిమితమవుతుందని వారంటున్నారు.
క్రితం సంవత్సరం జనవరి 5 న జరిగిన అఖిల పక్ష సమావేశం లో అప్పటి హోం మంత్రి చిదంబరం ఈ కమిటీ నివేదికను అన్ని పార్టీలకు అందించారు. ఈ నివేదిక ఫై ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి మరోసారి ఇలాంటి సమావేశమే నిర్వహిస్తామని ఆయన ఆ సమావేశంలో ప్రకటించారు. అయితే, ప్రస్తుత సమావేశంలో ‘శ్రీ కృష్ణ’ ఫై చర్చ ఉండదని హోం శాఖ ప్రకటించడంతో ఇక శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అట కెక్కినట్లేనని భావిస్తున్నారు.
ఈ సమావేశం అనంతరం తెలంగాణా ఫై స్పష్టమైన అభిప్రాయం ప్రకటించే అంశం కూడా తమకు తెలియదని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ అంశం ఫై ఏ విషయమూ తెలుసుకోవాలంటే 28 వరకూ ఆగాల్సిందే.