కవిత కేంద్రంగా తెలంగాణ రాజకీయం!
posted on Jun 28, 2023 @ 11:59AM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనే కాదు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ చుట్టి ఆడింది.. పాడింది. అయితే ప్రస్తుత ఎన్నికల సీజన్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు మాత్రం.. కల్వకుంట్ల కవితమ్మ చుట్టు తిరుగుతోన్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో పలువురు ప్రముఖలతో పాటు కల్వకుంట్ల కవిత పేరు సైతం ప్రముఖంగా వినిపించింది. ఆ క్రమంలో పలుమార్లు ఢిల్లీలోని ఈడీ ఎదుట విచారణకు ఆమె హాజరైంది. ఒకానొక సమయంలో కల్వకుంట్ల కవిత ఇహనో.. ఇప్పుడో అరెస్ట్ కావడం ఖాయమనే ఓ ప్రచారం సైతం గట్టిగానే నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె అరెస్ట్ ఆగిపోయిందని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆ అరెస్ట్ తాత్కాలికంగా ఆగిందా? లేక..? అన్న అనుమానాలు మాత్రం సర్వత్రా వినవస్తున్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే అది తమకే లాభమని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంటే.. ఆమె అరెస్టు ఎంత జాప్యమైతే అంత మేరకు తమకు నష్టమని బీజేపీ భావిస్తోంది. కవిత కనుక అరెస్ట్ అయితే.. బీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టిందన్న భావన ప్రజలలో కలిగి.. అది సానుభూతిగా మారి బీఆర్ఎస్ కు రాజకీయవాతావరణం సానుకూలంగా మారిపోతుందన్నది బీఆర్ఎస్ భావనగా ఉంటే.. కవితను అరెస్టు చేయకుండా వదిలేస్తే.. విపక్ష పార్టీలను బ్లాక్ మెయిల్ చేయడానికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్ధలను వాడుకుంటోందని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లవుతుందనీ, ఇది రాష్ట్రంలో తమ పార్టీ ప్రతిష్టను పలుచన చేస్తుందనీ తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తుండటంతో బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం అన్న కాంగ్రెస్ ప్రచారానికి ప్రజలలో మంచి స్పందన లభిస్తోంది. ఒక విధంగా కవిత ఎపిసోడ్ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య లాలూచీ అన్న భావన జనంలో వ్యక్తం అవుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా కవిత అరెస్టు కాకుండా ఉంటే.. మోడీ, కేసీఆర్ .. ఇద్దరూ ఇప్పటి చేసినదంతా డ్రామా అన్న భావన జనంలో బలపడుతుందన్న భావన ఇరు పార్టీలలో బలంగా వ్యక్తమౌతోంది. ప్రజలలో పడిపోతున్న గ్రాఫ్ పెరగాలంటే కల్వకుంట్ల కవిత అరెస్టు ఒక్కటే మార్గం అని బీఆర్ఎస్ భావిస్తుంటే.. కవిత అరెస్టు కాకుంటే తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసుకోవలసిందే అన్న భావన రాష్ట్ర బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని చూస్తే కర్నాటకలో బీజేపీ ఏ పరిస్థితి అయితే ఎదుర్కొందే అదే పరిస్థితి తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కవిత కేంద్రంగా తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడింది.