తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంటర్వ్యూ

 

తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక న్యూస్ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన, తెరాస-కాంగ్రెస్ విలీనం, జగన్మోహన్ రెడ్డి, సినీ పరిశ్రమ తదితర అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు:

 

రాష్ట్ర విభజన:

1. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తన స్వంత పార్టీ నేతలని కూడా పరిగణనలోకి తీసుకోకుండా అంతా రహస్యంగా సాగిస్తున్నందునే వారు కూడా తెలంగాణాపై చాలా సందిగ్ధంలో ఉన్నారు. మరటువంటప్పుడు కాంగ్రెస్ తెరాసను సంప్రదిస్తుందని మేము ఎదురుచూడలేదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ తెరాసను సంప్రదించ లేదు.

 

2. పది జిల్లాలతో కూడిన తెలంగాణా వస్తుందనే నమ్ముతున్నాము. భద్రాచలం, హైదరాబాద్ వంటి అంశాలపై ఎటువంటి రాజీలు ఉండబోవు. హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా తెరాస అంగీకరిస్తుంది గానీ ఆదాయంలో వాటా పంచి ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదు. కేంద్రమంత్రుల బృందం తన తుది నివేదిక సమర్పించిన తరువాతనే తెరాస స్పందిస్తుంది.

 

3. రానున్న ఎన్నికలలోగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని మా పార్టీ బలంగా కోరుకొంతోంది. లేకుంటే వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వం తన మనుగడ కోసం సీమాంధ్ర యంపీలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడితే మళ్ళీ తెలంగాణా వెనక్కి జరిగిపోయే ప్రమాదం ఉంది.

 

కాంగ్రెస్-తెరాస విలీనం, పొత్తులు: ఇంతవరకు అటువంటి ఆలోచనలేవీ లేవు. మున్ముందు ఉంటాయేమో ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం తెలంగాణా విషయంలో నాన్చివేత ధోరణి అవలంభించిన కారణంగానే ఆ పార్టీ తెలంగాణాలో దీన స్థితిలో ఉంది. అది స్వయంకృతాపరాదమే. అందుకే ప్రజాభిమానం ఉన్న తెరాసను విలీనం లేదా పొత్తుల గురించి అడుగుతోంది. అయితే తెరాస తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించాలని కోరుకొంటోంది గనుక, తన ఉనికిని నిలుపుకోవడం కూడా అవసరమే. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతే ఇక మా మాటకు విలువేమి ఉంటుంది?

 

జగన్మోహన్ రెడ్డి, వైకాపా: జగన్మోహన్ రెడ్డి తన పార్టీని సమర్ధంగా నడిపించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. అతను ఓదార్పు యాత్రల పేరిట ప్రజల మధ్యే ఉంటూ తన పార్టీని బలపరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అతని పార్టీ సీమాంధ్రకే పరిమితమయింది గనుక, మేము, మా తెలంగాణా ప్రజలు కూడా అతని గురించి, అతని పార్టీ గురించి పూర్తిగా ఆలోచించడం మానేశాము. అయితే రానున్న ఎన్నికలలో వైకాపా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో పోటీ చేయవచ్చునేమో కానీ తెలంగాణా అంతటా పొటీ చేయగలదని మేము భావించడం లేదు. ఒకవేళ పోటీ చేస్తే ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు.

 

ఆయన ప్రస్తుతం చేస్తున్న దేశాటన తన ఉద్యమానికి మద్దతు కూడ గట్టడానికే కాక తనను తాను జాతీయ స్థాయి నాయకుడిగా ప్రమోట్ చేసుకోనేందుకు ప్రయత్నిస్తునారు. అందరితో పరిచయాలు పెంచుకొని తద్వారా రానున్న ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలో తన ప్రభావం చూపాలని ఆయన ఆశిస్తున్నట్లున్నారు.

 

సినీ పరిశ్రమ: సినీ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా వ్యాపార శైలిలోనే నడుస్తోంది. అందువలన వ్యాపారులకు తమకి ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడికే కదిలి వెళ్లిపోవడం సహజం. వారు ఇక్కడే ఉన్నా, ఏ వైజాగ్ కో వెళ్ళిపోయినా మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘తెలంగాణా సినీ పరిశ్రమ’ ఏర్పాటుకు తగిన కృషి చేస్తాము. తగిన ప్రోత్సాహకాలు అందించి పరిశ్రమ నిలద్రోక్కుకోనేలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. అలాగని టాలివుడ్ కి అన్యాయం చేయబోము.