శ్రీలక్ష్మి ఐఏఎస్ కి తెలంగాణ హైకోర్టు షాక్
posted on Jul 25, 2025 @ 3:12PM
ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందే . గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు ఇదే ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదని పేర్కొంటూ, ఆ కేసునుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అదే తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి ప్రమేయంపై విచారించేందుకు సీబీఐ, ఈడీలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహా రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని విచారించాల్సిందేనని.. ఆ అక్రమాలలో ఆమె పాత్ర సుస్పష్టంగా ఉందని.. తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆమెను విచారించేందుకు సీబీఐ, ఈడీలకు అవకాశం కల్పిస్తున్నట్టు తేల్చి చెప్పింది. ఇదే కోర్టు గతంలో గనుల కేసులో శ్రీలక్ష్మికి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆమెను కేసు నుంచి తప్పించాలని సీబీఐ, ఈడీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. సీబీఐ, ఈడీలు.. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్ర స్పష్టంగా ఉందని తెలుస్తోందని.. ఆమెను కేసు నుంచి ఎలా తప్పిస్తారని నిలదీస్తూ.. మరోసారి దీనిపై హైకోర్టు విచారణ చేసి.. ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. దీంతో హైకోర్టులో మరోసారి శ్రీలక్ష్మి.. తనను ఈ కేసు నుంచి తప్పించాలని కోరుతూ.. రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శ్రీలక్ష్మి కేసును విచారించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ వాదనలు వినకుండా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహ రించుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి అన్ని అనుమతులనూ శ్రీలక్ష్మి ఇచ్చారని.. ఆమె ఉద్దేశ పూర్వకంగానే ఈ అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ సీబీఐ ఆరోపిస్తోంది. అయితే, ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలకు మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, అధికారిగా తన పాత్ర పోషించానని శ్రీలక్ష్మి చెబుతున్న శ్రీలక్ష్మి ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతున్నారు.