రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించి తీరాల్సిందే.. కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు అల్టిమేటమ్
posted on Jan 25, 2023 @ 5:24PM
తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు కేసీఆర్ కోవిడ్ సాకు చూపడం అపహాస్యం పాలైంది. ఎంత సీఎం అయినా ఇష్టారీతిగా వ్యవహరించడానికి వీలులేదని తేటతెల్లమైంది. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గట్టిగా మొట్టి కాయలు వేసింది. బీఆర్ఎస్ సభ నిర్వహించుకోవడానికి అడ్డు రాని కోవిడ్.. గణతంత్రవేడుకలకు ఎలా అడ్డొచ్చిందని ప్రశ్నించింది. కోవిడ్ సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు ఆపడం సరికాదని తెలంగాణ హైకోర్టు కేసీఆర్ సర్కార్ కు తేల్చి చెప్పింది.
రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించి తీరాల్సిందేనని తెలంగాణ కోర్టు విస్పష్టంగా చెప్పింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు బుధవారం(జనవరి 25) విచారణ జరిపింది. పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరిపి తీరాల్సిందేనని ఆదేశించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, కొవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదని కోర్టు తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది.
కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే.. కొవిడ్ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండగ అని.. దేశభక్తిని చాటిచెప్పే పండగ అని వ్యాఖ్యానించింది. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకలు జరపాలన్న హైకోర్టు... పరేడ్ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ పాటించాలని ఆదేశించింది.
అంతకు ముందు వాదనల సందర్భంగా ఖమ్మం సభకు అడ్డు రాని కోవిడ్ రిపబ్లిక్ డే వేడుకలకు అడ్డు వచ్చిందా అని ప్రశ్రించింది. ఇలా ఉండగా హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. కోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు వంటిదని పేర్కొంది.
ఇష్టారీతిగా, రాజ్యాంగబద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలని భావించిన కేసీఆర్ కు హైకోర్టు తీర్పుతో ఎదురు దెబ్బ తగిలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోవిడ్ సాకు చూపి కరోనా సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేమని చెప్పడాని పెద్ద జోక్ అని పేర్కొన్న బండి జనం కేసీఆర్ ను జోకర్ గా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.