నాలుక్కే దిక్కు లేదు ..24 ఎక్కడ?.. రైతుల విద్యుత్ కష్టాలు
posted on Feb 11, 2023 @ 10:11AM
తెలంగాణ ప్రభుత్వం చెప్పుకునే గొప్పల్లో 24 /7 ఉచిత విద్యుత్ ఒకటి.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజులు ఉచిత విధ్యత్ ఇస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు అధికార పార్టీ నాయకులందరూ ప్రతి రోజు చెపుతూనే ఉంటారు. అలాగే ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ ఎజెండాలో ఫ్రీ పవర్ ఒక మెయిన్ ఫ్లాంక్’ గా వుంది. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులందరికీ, రోజుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. అంతే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు మనసు లేక కానీ, లేదంటే ఆదేమంత పెద్ద కష్టం కాదని, ఎక్కడికెళితే అక్కడ చెప్పిన లెక్కలే పదే పదే ఎకరుప్వు పెడుతున్నారు. తాజాగా నాందేడ్ సభలోనూ కేసీఆర్’ కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, దేశంలోని రైతు లందరికీ ఉచిత్ అవిధ్యుత్ ఇస్తామని మరోమారు వగదనం చేశారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్’ తీరు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్లు ఉందని అంటున్నారు.
రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నది నిజం, కానీ, 24 గంటలు ఇస్తున్నామని చెప్పుకోవడం ఏదైతే వుందో, అది అసత్యం. సత్య దూరమైన విషయమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలే కాదు, టీస్ జెన్కో, ట్రాన్స్కో సిఎండీ ప్రభాకర రావు కూడా అదే చెప్పారు. ఇప్పుడే కాదు, ఎప్పడు కూడా వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వంక రెండు మూడు రోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, 24 గంటలు ఉచిత విద్యుత్ తవడం లేదనే సభ్యులు, ఎలక్ట్రిక్’ తీగలు పట్టుకోవాలని ఇంకెవరో మంత్రి అన్న మాటలను ఉటంకిస్తూ ప్రతిపక్ష సభ్యులను ఎగతాళి చేశారు. మరోవంక రైతులు ఎదుర్కుంటున్న విద్యుత్ కష్టాలపై చర్చించాలని కోరుతూ, కాంగ్రెస్ సభ్యులు ఇచిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. కాంగ్రెస్ సభ్యులు చేసేది లేక, సభనున్కిఉ వాకౌట్’ చేసి మీడియాకు మొరపెట్టుకున్నారు.
ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి “24 గంటల ఉచిత విద్యుత్ కేవలం ఊత పదమైంది. కనీసం 13 గంటలు విద్యుత్ కూడా ఇవ్వడం లేదు” అని అన్నారు. నిజం, జీవన రెడ్డి అన్నట్లుగా, రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు కాదు, కనీసం నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండడం లేదని, రోడ్డెక్కిన రైతులే చెపుతున్నారు. ఈ రోజుకు ఈరోజు నల్లగొండ జిల్లాలో కరెంటు కోతలపై రైతులు ఆందోళనకు దిగారు. నకిరేకల్, నల్లగొండ, నాగర్జునసాగర్, తిప్పర్తి సహ పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న (గురువారం) రాత్రి నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రైతులు సబ్ స్టేషన్ ను ముట్టడించగా.. ఈరోజు (శుక్రవారం)తిప్పార్తి లో ధర్నా చేపట్టారు. వ్యవసాయ బోరు బావులకు నాలుగు గంటలు కూడా కరెంటు రావడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
అలాగే, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బండలింగాపూర్ గేటు వద్ద వందలాది మంది రైతులు నేషనల్ హైవే 63పై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ..‘‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ నాలుగైదు గంటలకు మించి ఇవ్వడం లేదు. కరెంటు కోతలతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే,నిన్న నిర్మల్– భైంసా రోడ్డుపై కాంగ్రెస్ నేతలతో కలిసి రైతులు రాస్తారోకో చేశారు. సర్కార్ కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని, ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట సబ్స్టేషన్ఎదుట రైతులు ధర్నా చేశారు. కరెంటు లేక ట్లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కరెంట్5 గంటలకు మించి రావడం లేదు. అది కూడా ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక బావుల వద్దే పడిగాపులు కాస్తున్నాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో రైతులు సబ్స్టేషన్ను ముట్టడించారు. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని ఆందోళన చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మాక్లూర్మండలంలోని దాస్ నగర్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. కరెంటు కోతలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాలో కరెంట్ సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఓ రైతు సబ్‌స్టేషన్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోలు సబ్ స్టేషన్ కు రైతులు గురువారం తాళం వేశారు. ఇవ్వన్నీ ఒకటి రెండు రోజుల్లో మీడియాలో వచ్చిన వార్తలు మాత్రమే. నిజానికి, రాష్ట్రంలో ఇనక నేక చోటల్ ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.అయినా, ప్రభుత్వం మాత్రం, జీవన్ రెడ్డి అన్నట్ల్గు ఇంకా 24 గంటల ఊతపదాన్ని వదలడం లేదు.