కేసీఆర్ కానుకిచ్చినా కోపమే! తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో చీలిక?
posted on Dec 30, 2020 @ 10:25AM
వరాలు ప్రకటించినా ఉద్యోగుల విమర్శలెందుకు? కేసీఆర్ మాటలు అమలవుతాయన్న ఆశ పోయిందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ పై నమ్మకం లేదని తెలుస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినా.. ఉద్యోగులు స్వాగతించకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కేసీఆర్ ప్రకటనను మెజార్టీ ఉద్యోగులు వ్యతిరేకించడం టీఆర్ఎస్ వర్గాలను కూడా విస్మయపరుస్తోంది. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ ప్రకటన రాగానే.. ఉద్యోగ సంఘాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అధికార పార్టీ భావించిందట. కాని సీఎం ప్రకటన వచ్చిన నిమిషాల్లోనే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో గులాబీ నేతలు షాకయ్యారని తెలుస్తోంది. సీఎం నిర్ణయాన్ని కొన్ని సంఘాలు మాత్రమే స్వాగతించగా.. మెజార్టీ ఉద్యోగ సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులను మరోసారి మోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటనతో ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయని తెలుస్తోంది.
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షుడిగా కమిటిని నియమించడం ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందిన నివేదికను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని, దానికి అనుగుణంగా వేతన సవరణ ఎంత చేయాలన్నది మంత్రివర్గం నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే పీఆర్సీ కమిటీకి పెట్టిన రెండేండ్ల గడువు ముగిసినా ఇంత వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. రెండేండ్లుగా పీఆర్సీ కమిటీ చేయని పనిని ఇప్పుడు చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కొత్త కమిటీ చేస్తుందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండటంతో.. ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకే సీఎం కేసీఆర్ కొత్త కుట్రకు తెరలేపారని కొన్ని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు రానున్నాయి. ఎలాగూ ఎన్నికల కోడ్ వస్తది కాబట్టి.. ఆ పేరుతో తప్పించుకోవడం కోసం మరో నాటకం మొదలుపెట్టారనే విమర్శలు వస్తున్నాయి.
ఉద్యోగవర్గాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కమిటీలు, అధ్యయనాలతో కాలయాపన చేయరాదని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి డిమాండ్ చేశారు. వేతన సవరణ గురించే వేతన సవరణ కమిషన్ వేశారని, రెండున్నరేండ్లు దాటినా పీఆర్సీ నివేదిక సబ్మిట్ చేయలేదని విమర్శించారు. కనీసం సబ్మిట్ చేయని రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ వేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతామని నిర్ధిష్టంగా చెబుతూ మేనిఫెస్టోలో పెట్టారని, అలాంటి అంశంపై మళ్లీ చర్చ ఎందుకు, అధ్యయనం ఎందుకని సంపత్ కుమారస్వామి ప్రశ్నించారు. ఈ అధ్యయనాలు, చర్యలు పూర్తి అయ్యేలోగా మళ్లీ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన కోడ్, ఆ తర్వాత పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చివరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి ఇస్తుంటే.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నడని మండిపడ్డారు. కేసీఆర్ బహురూపుల వేషాలను ఇక ఎవరూ నమ్మరని, పగటి వేషగాళ్లు కూడా కేసీఆర్ ను చూసి నవ్వుకుంటున్నారని బండి సంజయ్ కామెంట్ చేశారు. ఆరేండ్ల నుంచి మాటలు చెప్తూ ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస్తూనే వస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు జీతాలు పెంచుతం, ఉద్యోగాలు భర్తీ చేస్తమనుకుంట కేసీఆర్ చేసిన ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే.. సీఎంను బజార్ లో నిలబెడ్తామన్నారు. కొంతకాలం మోసం చేయొచ్చేమోగానీ.. అందరినీ అన్నిసార్లు మోసం చేయలేమన్న విషయాన్ని సీఎం గుర్తు తెచ్చుకోవాలన్నారు సంజయ్.