గాంధీభవన్లో మళ్లీ రేవంత్ ప్రకంపనలు... అధిష్టానానికి మరోసారి సీనియర్ల ఫిర్యాదు.!
posted on Oct 23, 2019 @ 11:46AM
నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో... నరులెవరు నడవనది ఆ రూట్లో నేనడిచెదరో... పొగరని అందరు అన్నా... అది నా నైజం... తెగువని కొందరు అన్నా-అది నా మేనరిజం... నేను ఒక్కడిని ఒకవైపు... లోకం ఒకవైపు... ఈ పాట సరిగ్గా అతికినట్లు రేవంత్ రెడ్డికి సరిపోతుందేమో... ఎందుకంటే, టీఆర్ఎస్ లో ఉన్నా... టీడీపీలో ఉన్నా... ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా... రేవంత్ రెడ్డి స్టైలే వేరు... రేవంత్ ఏం మాట్లాడినా... ఏం చేసినా సంచలనమే... అన్న అడుగేస్తే మాస్... అన్న చెయ్యేస్తే మాస్ అన్నట్లుగా రేవంత్ కి నిజంగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ... ఇక రేవంత్ నోరు విప్పాడంటే... పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మించిన డైలాగ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి... అందుకే, కేసీఆర్ కు సరైనోడు రేవంతే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే, సముద్రంలాంటి కాంగ్రెస్ లో ఎవరైనా మాట నెగ్గించుకోవాలంటే ఆషామాషీ కాదు... అలాంటిది తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ తనదైన ముద్ర వేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ దూకుడే సీనియర్లకు నచ్చడం లేదట. మొన్నటికిమొన్న హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై ఘాటు వ్యాఖ్యలుచేసి సంచలనం సృష్టించిన రేవంత్... ప్రగతి భవన్ ముట్టడితో మరోసారి టీకాంగ్రెస్ లో కలకలం రేపారు. అసలు ఎవర్ని అడిగి, ఎవరితో చర్చించి రేవంత్... ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చాడని వీహెచ్, జగ్గారెడ్డి లాంటి లీడర్లు ఫైరవుతున్నారు. రేవంత్ పిలుపునిస్తే తాము ఆందోళనలో పాల్గొనాలా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. మరో అడుగు ముందుకేసి, రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదుచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ తన సొంత అజెండాను పార్టీపై రుద్దుతున్నాడని సీనియర్లు మండిపడుతున్నారు. పార్టీని సైతం పక్కనబెట్టి తానొక్కడే హైలేట్ కావాలని చూస్తున్నాడని ఫైరవుతున్నారు. అయితే, రేవంత్ వ్యూహాన్ని కొందరు నేతలు మెచ్చుకుంటున్నారు. రేవంత్ లాగా అందరూ పనిచేస్తే కాంగ్రెస్ పుంజుకుంటుందని అంటున్నారు. మరింత రేవంత్ తాజా ఎపిసోడ్ గాంధీభవన్లో ఎలాంటి ప్రకంపలను సృష్టిస్తుందో చూడాలి.