తెలంగాణా ఎంపిలు ఇక కాంగ్రెస్ కు దూరం ?
posted on Dec 5, 2012 @ 10:56AM
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయం ఫై పట్టుదలతో ఉన్న తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపి లు ఇక కాంగ్రెస్ కు దూరమయినట్లే భావిస్తున్నారు. ఎఫ్డిఐల విషయం ఫై పార్లమెంట్లో ఓటింగ్ జరగనుండటంతో ఈ ఎంపి లతో చర్చలు జరపాలని పార్టీ అధిష్టానం మంత్రులు కమల నాధ్, సుశీల్ కుమార్ షిండేలను ఆదేశించింది. అయితే, ఎంపి లు ఈ సమావేశానికి డుమ్మా కొట్టి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో చర్చలు జరపడం చర్చనీయాంసంగా మారింది.
కేంద్ర మంత్రులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎంపి లు పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాజయ్య, మంద జగన్నాధం లు హాజరు కాలేదు. పార్టీ అధిష్టానం కూడా వీరి తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.నేడు పార్లమెంట్లో ఓటింగ్ జరగనుండడంతో, ‘తెలంగాణా’ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
కాంగ్రెస్ ఎంపి లు డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ విషయం ఫై అఖిల పక్షం ఏర్పాటు విషయంలో ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.ఓటింగ్ విషయం లో పార్టీని ఇరుకున పెట్టి, తద్వారా తెలంగాణా విషయంలో ఓ అడుగు ముందుకు వేద్దామని భావిస్తున్న వీరికి, ఓటింగ్ లో పార్టీ గట్టేక్కితే తమ పరిస్థితి ఏమిటన్నది అంతుపట్టడం లేదు.