బీజేపీపై యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్... సోనియాకి ఆహ్వానం!!
posted on Dec 26, 2019 @ 10:32AM
బీజేపీపై యుద్ధానికి టీఆర్ఎస్ సిద్దమైందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వారికి మద్దతుగా ఉద్యమించేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు సన్నద్ధమయ్యారని సమాచారం. అందులో భాగంగానే మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన హైదరాబాద్‌లో ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా?’ నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ నిర్మిస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఎందుకో మౌనం వహించారు. ఇప్పుడు మళ్లీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. సీఏఏ, ఎన్నార్సీల పుణ్యమా అని కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించేందుకు అవకాశం దక్కింది. జాతీయ స్థాయిలో తాను జరిపే పోరాటంతో లౌకిక వాదులు, ముస్లింలు వచ్చే ఎన్నికల్లో తనకు అండగా నిలబడతారని కేసీఆర్ భావిస్తున్నారట. ఇటు తెలంగాణలోను, అటు దేశవ్యాప్తంగాను బీజేపీ విస్తరణను అడ్డుకొనేందుకు ఇదే అదునుగా భావిస్తూ, విపక్షాలను సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సీఏఏ, ఎన్‌సీఆర్‌లను వ్యతిరేకిస్తూ కేసీఆర్ జనవరి 30న హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ముస్లిం నాయకులు, ప్రతినిధులను దేశం నలు మూలల నుంచి ఆహ్వానించే బాధ్యతను అసదుద్దీన్ ఒవైసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సభకు సోనియా గాంధీ, మమత బెనర్జీ, నితీశ్ కుమార్, పినరై విజయన్ లను ఆహ్వానించనున్నారని సమాచారం.