మోడీతో గంట... అమిత్ షాతో అరగంట... మొత్తం 22 డిమాండ్లతో మెమొరాండం
posted on Oct 5, 2019 @ 12:17PM
నీళ్లు, నిధులే ప్రధాన అజెండాగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులను కలిసిన సీఎం కేసీఆర్... కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గంటకు పైగా మోడీతో సమావేశమైన కేసీఆర్... మొత్తం 22 అంశాలతో తెలంగాణ సమస్యలను, అవసరాలను ప్రధాని ముందు పెట్టారు. ముఖ్యంగా ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థలో మార్పులకు ఆమోదం, రిజర్వేషన్ల పెంపునకు అనుమతి, యురేనియం తవ్వకాల నిలిపివేత, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు నిధుల కేటాయింపు... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు ఉంచారు. అదేవిధంగా, ఆయుష్మాన్‌భవ నిధులు ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన కేసీఆర్.... ఏపీలో కలిసి తలపెట్టిన గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై చర్చించారు. అలాగే, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించి నిధులు ఇవ్వాలని కోరారు. ఇక, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు రక్షణశాఖ భూములను ఇవ్వాలంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం కేసీఆర్... తెలంగాణ అవసరాలు, సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.
-ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ అందజేసిన వినతిపత్రం-
1. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఐదో విడత సాయంగా 450కోట్లు
2. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆదిలాబాద్ జిల్లా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ
3. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుండి 42 వరకు పెంచడం
4. తెలంగాణలో ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) ఏర్పాటు
5. ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)
6. కొత్త జిల్లాల్లో 23 జవహర్ నవోదయ విద్యాలయాల మంజూరు
7. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి కోసం నిధుల మంజూరు
8. మిషన్ కాకతీయకు 5వేల కోట్లు... మిషన్ భగీరథకు 19వేల 205కోట్లు ఇవ్వాలని వినతి
9. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు
10. జహీరాబాద్ దగ్గర జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (నిమ్జ్) కోసం నిధుల విడుదల
11. హైదరాబాద్‌లో నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి) ఏర్పాటు
12. ఎస్సీల ఉప వర్గీకరణ (అసెంబ్లీ తీర్మానం)
13. కరీంనగర్‌లో పీపీపీ మోడల్ కింద ఐఐఐటీ మంజూరు
14. రిజర్వేషన్లు పెంపు (అసెంబ్లీ తీర్మానం)
15. హైదరాబాద్ అభివృద్ధి-నాగ్‌పూర్ & వరంగల్-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు
16. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వెనుకబడ్డ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ కోసం 4వేల కిలోమీటర్ల మేర అప్‌గ్రేడ్ చేయడానికి నిధుల కేటాయింపు
17. లెఫ్ట్ వింగ్ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ వర్క్స్ ఖర్చును కేంద్రమే భరించాలి
18. గిరిజన విశ్వవిద్యాలయానికి పూర్తి కేంద్ర నిధులు
19. వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు రూ.1000 కోట్లు
20. రామప్ప ఆలయం-ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు
21. వరద ప్రవాహ కాలువ - సవరించిన వ్యయం
22. రహదారుల వెడల్పు కోసం రాష్ట్ర ప్రభుత్వ భూములతో రక్షణ భూముల మార్పిడి.