టి బిల్లుపై కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
posted on Feb 13, 2014 @ 10:40AM
లోకసభలో రాష్ట్ర విభజన బిల్లుని ఈరోజే ప్రవేశపెట్టనున్నారని సర్వత్రా వార్తలు వస్తున్న సమయంలో పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టడమా....లేక సోమవారం ప్రవేశపెట్టడమా అన్న దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైల్వే బడ్జెట్, ఓటాన్ అకౌంట్‌పైనా దృష్టి పెట్టాల్సి ఉందని కమల్‌నాథ్ పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి సవరణలు, మార్పులు చేయనవసరం లేదని, బిల్లుని యధాతధంగా లోక్ సభలో ప్రవేశపెట్టవచ్చని, బిల్లుని ఆమోదించడానికి సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏనుగంత బలం చేకూరినట్లయింది. అందుకే ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.