పోలీసింగ్ లో కాదు.. పట్టపగలు హత్యల్లో ఫస్ట్! మరో బీహార్ లా తెలంగాణ?
posted on Feb 19, 2021 @ 2:34PM
నడిరోడ్డుపై కత్తులతో స్వైర విహారం. పట్టపగలు దారుణ హత్యలు. తల్వార్లు, వేట కొడవళ్లతో మనుషులను నరకడమేంటి? ఈ తెలంగాణకు ఏమైంది? ఏమిటీ అరాచకాలు? పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఖాకీలంటే భయం పోయిందా? కొందరు ఎందుకింతలా బరితెగిస్తున్నారు?. వరుసగా జరుగుతున్న ఘటనలు తెలంగాణను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ కాప్స్ కు.. పట్టపగలే జరుగుతున్నమర్డర్లు మచ్చగా మారుతున్నాయి. అంతేకాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ విఫల ప్రయోగమా? తెలంగాణ మరో బీహార్ లా మారుతోందా? అనే చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరి 17న జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసు సంచలనం. అంతకు మించి దారుణం. పట్టబగలు, నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగా నరికి నరికి చంపేశారు దుండగులు. హత్య చేసిన తీరు మాత్రం అత్యంత హేయనీయం. విచక్షణారహితంగా కత్తి పోట్లతో విరుచుకుపడ్డారు. ఆ మనుషులు మృగాళ్లలా ప్రవర్తించారు. మహిళను సైతం అత్యంత పైశాచికంగా చంపేశారు. ఆ మారణకాండను అక్కడున్న జనమంతా నోరెళ్లి బెట్టి చూశారే కానీ, ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. నడిరోడ్డు మీదే మర్డర్ జరగడంతో.. అటుగా వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. రెండు ఆర్టీసీ బస్సులు ఆగి పోయాయి. వాటి నిండా జనం ఉన్నారు. అయినా.. ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి.. ఆ మర్డర్ సీన్ ను తమ మొబైల్ లో వీడియో తీశారే కానీ, కనీసం అరవడమో, ఆపడమో, అడ్డుకోవడమో చేయలేదు.
నడిరోడ్డుపై కత్తులతో మర్డర్ జరగడం తెలంగాణలో ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేక ఘటనలు. 2018 సెప్టెంబర్ 26న హైదరాబాద్ అత్తాపూర్ లోనూ అచ్చం ఇలాంటి దారుణమే జరిగింది. కిషన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ లు కలిసి రమేశ్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. మెట్రో పిల్లర్ కు సమీపంలోనే, పట్టబగలే, వందలాది మంది జనం చూస్తుండగానే జరిగిన ఈ మర్డర్ అప్పట్లో సంచలనం స్పష్టించింది. ఆ సమయంలోనూ జనమంతా ఆ మర్డర్ ను కళ్లప్పగించి చూశారే కానీ ఎవరూ అడ్డుకోలేదు. కసిగా గొడ్డలితో నరికి చంపి.. ఆ తర్వాత తీరిగ్గా నిందితులు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. బీహార్ తరహా హత్య అంటూ అప్పట్లోనే ఆ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు లాయర్ దంపతుల మర్డర్ తో మరోసారి తెలంగాణలో బీహార్ తరహా హత్యలంటూ చర్చ జరుగుతోంది.
2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను కూడా ఈ కోవలోనే చూస్తున్నారు. కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్ష్యతో ప్రణయ్ ను కిరాతకంగా మర్డర్ చేయించాడు అమృతరావు. సుపారీ గ్యాంగ్ వేట కొడవలితో ప్రణయ్ ను ఆసుపత్రి ప్రాంగణంలో నరికి చంపేసింది. ఆ కేసు తెలంగాణను షేక్ చేసింది. 2021 జనవరి 28న జనగామ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అక్కడే మాటువేసిన ఇద్దరు వ్యక్తులు పులిస్వామిని కిరాతకంగా దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నాలుగు ఘటనలే కాదు.. కెమెరాలకు చిక్కని కేసులు ఇంకా అనేకం. ఏ ఘటనకు అదే అత్యంత దారుణం.
లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ భేష్ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. అలాంటిది ఆయన పార్టీ మండల స్థాయి నేత ఇలా నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపడం చిన్న విషయమేమీ కాదు. అందులోనూ.. ఏకంగా హైకోర్టు లాయర్లను హత్య చేయడం వారి బరితెగింపునకు నిదర్శనం. ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థపైనే పరోక్ష దాడి అని అంటున్నారు. అందుకే, హైకోర్టు సైతం ఘటనపై సీరియస్ గా స్పందించి ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. న్యాయవాది దంపతుల కేసులో పోలీసుల ఉదాసీన వైఖరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
బీహారులోనే ఇలా జరుగుతుందని.. తమకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని బెదిరించడం, చంపడం అక్కడ కామనేనని.. ఇప్పుడు తెలంగాణలోనూ బీహార్ లాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. బంగారు తెలంగాణ తెస్తామని.. ఆటవిక తెలంగాణ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంటున్నారు. భూముల ఆక్రమణలు, నడిరోడ్డుపై మర్డర్లతో తెలంగాణ బీహార్ నే మించేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విఫల ప్రయోగమని.. పాలకుల చేతగాని తనం వల్లే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలంగాణ మరో బీహార్ లా మారిపోతోంది.