Read more!

బీఆర్ఎస్ గాలి తీసేసిన తెలంగాణ ఆవాజ్ సర్వే

 బీఆర్ఎస్ కు ఇటీవలి కాలంలో ఏదీ కలిసి రావడం లేదు. గత ఏడాది చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం నుంచి మొదలై నేతల వలసల నుంచి.. వచ్చే లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక వరకూ అన్నీ కష్టాలే ఎదుర్కొంటోంది. దీనికి తోడు బీఆర్ఎస్ బడా నేతలపై అవినీతి ఆరోపణలు ప్రజలలో వారి ప్రతిష్టను పలుచన చేసేశాయి. ఇప్పుడు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది.  పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించగా.. అదే చేవెళ్ల నుంచి గులాబీ బాస్ కేసీఆర్ శనివారం (ఏప్రిల్ 13)న ప్రారంభించారు.  మరోవైపు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారు   విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌, బీజేపీ దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  

ఈ నేపథ్యంలో ఇప్పటికే వెలువడిన పలు ఫలితాలు రాష్ట్రంలో ముక్కోణపు పోరు ఖాయమని పేర్కొన్నాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో కాంగ్రెస్ పై చేయి సాధించే అవకాశం ఉందని చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ నిలుస్తుందనీ, బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదని అంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఆవాజ్ వెలువరించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు రెండు నుంచి నాలుగు స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వే కూడా రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకుంటుందని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 29.8శాతం ఓట్లతో ఆరు నుంచి ఎనిమిది లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.

ఇక బీజేపీ 29.6శాతం ఓట్లతో ఐదు నుంచి ఏడు స్థానాలలో విజయం సాదిస్తుందనీ బీఆర్ఎస్ మాత్రం 24.3 శాతం ఓట్లతో రెండు నుంచి నాలుగు స్థానాలకు పరిమితమౌతుందని తెలంగాణ ఆవాజ్ సర్వే తేల్చింది. ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఆ ఇతరులు అంటే ఎంఐఎం అన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంటుందని సర్వే పేర్కొంది. ఇక ఇప్పటికీ ఎటువైపు అన్నది లేలని తటస్థుల ఓట్ల శాతం 12.3 శాతం వరకూ ఉంటుందని సర్వే పేర్కొంది.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని మరిచిపోయేలా లోక్ సభ ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు ఈ తాజా సర్వే గాలి తీసేసినట్లైంది. మొత్తం మీద బీఆర్ఎస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కనీస స్థానాలతో సరిపెట్టుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.