తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణకు సర్వం సిద్ధం
posted on May 30, 2024 9:20AM
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయ జయహే తెలంగాణ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీని ఎంఎం కీరవాణి సమకూర్చారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. స్వయంగా గీత రచయత అందెశ్రీ కోరితేనే తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీ కూర్చే బాధ్యతను కీరవాణికి అప్పగించామని రేవంత్ చెప్పారు. కాగా బుధవారం (మే29) ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి, ఆయన గాన బృందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు కలిశారు.
కీరవాణి స్వరపరిచిన పాటను విన్నారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా.. అస్తిత్వానికి ప్రతీకగా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా.. సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంది. దాని ఔన్నత్యం ఏమాత్రం దెబ్బతినకుండా ప్రతిఒక్కరూ సులువుగా ఆలపించేలా కీరవాణి ఆయన బృందం పాటను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు, గీత రచయిత అందెశ్రీ, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు కూడా ఈ గీతాన్ని విన్నారు.