అన్నీ మీరే డిసైడ్ చేసేస్తారా?
posted on Nov 2, 2013 @ 7:13PM
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి పదహారు మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఒక వినతిపత్రం పంపించారు. ఆ వినతిపత్రంలో సీమాంధ్రుల మీద తెలంగాణ ఎమ్మెల్సీలు కురిపించిన ప్రేమని చూసి సీమాంధ్రులు ఇంత ప్రేమని తట్టుకోలేం బాబోయ్ అంటున్నారు. హైదరాబాద్‌ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సీమాంధ్రుల మీద ప్రేమతో టీ ఎమ్మెల్సీలు దీనిమీద ఒక సవరణ ప్రతిపాదించారు. హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా కాదుకదా, రెండు మూడేళ్ళు తాత్కాలిక రాజధానిగా కూడా ఉంచకూడదట. దానికి కారణం ఏమిటంటే, హైదరాబాద్ సీమాంధ్ర ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నందువల్ల అక్కడి నుంచి ఇక్కడి వరకూ రావడానికి సీమాంధ్రులు ఇబ్బంది పడతారట. పదేళ్ళపాటు సీమాంధ్రులని ఇలా ఇబ్బంది పెట్టడం మంచిది కాదట.
కాబట్టి రాష్ట్రాన్ని విభజించిన వెంటనే ఓ సంవత్సరం లోగానే సీమాంధ్ర రాజధానిగా వైజాగ్‌ని ఎంపిక చేసేస్తే ఓ పనైపోతుందని సూచించారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రుల్ని తరిమేయడం వాళ్ళ ఇష్టం.. సీమాంధ్ర రాజధానిగా ఏ నగరాన్ని చేయాలన్నది కూడా వాళ్ళ ఇష్టమేనన్నమాట. బాగుందయ్యా.. చాలా బాగుంది!