అంతా తావీదు మహిమేనా?
posted on Apr 19, 2023 @ 2:12PM
వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాత్రం నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటారు. ఆయన పేరుకే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్. కానీ ఆయన వైద్యంపై నమ్మకం లేదు. కరోనా తగ్గడానికి ఏసుక్రీస్తు మహిమే కారణమనీ, వ్యాక్సిన్లు, వైద్యం ఇవేమీ కాదనీ గతంలో ఒక సారి వాకృచ్చి పీకల్లోతు వివాదంలో కూరుకున్నారు.
తాజాగా మంత్రించిన తావేదే సర్వ రోగ నివారిణి అంటూ వ్యాఖ్యనించి మరో సారి వివాదాన్ని ఆహ్వానించారు. తాను చిన్న తనంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాననీ, వైద్యులందరూ చేతులెత్తేసి లాభం లేదని చెప్పారనీ, అయితే తాను తీవీదు మహిమవల్ల బతికాననీ చెప్పారు హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. ఎవరో నిరక్షరాస్యుడు, సామాన్యుడు ఈ మాట చెబితే.. అలా కాదు అదంతా మూఢనమ్మకం అని చెప్పి శాస్త్రీయంగా చికిత్సను తీసుకోవాలని చైతన్యం కలిగించాల్సిన పదవిలో ఉన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ స్వయంగా వైద్యాన్ని నమ్ముకోకండా, తావీదులను మూఢ నమ్మకాలను నమ్ముకోండంటూ ప్రజలకు చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారంటే... తన పేరుమీద ఏర్పాటు చేసిన జీఎస్ఆర్ (గడల శ్రీనివాసరావు) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో.. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ముస్లింలను అవమాన పరిచేవిగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక గతంలో ఆయన క్రీస్తు దయవల్లే కరోనా నుంచి బయటపడ్డామని, క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అక్కడితో ఊరుకోకుండా ప్రపంచానికి అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమనీ ప్రపంచం అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమని చెబుతూ క్రైస్తవమత ప్రచారానికి నడుంబిగించాలని పిలుపు నిచ్చారు. ఆయన వ్యక్తిగత మత విశ్వాసాలను ఎవరూ అభ్యంతర పెట్టరు.. కానీ హెల్త్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆయన కరోనా మహమ్మారికి వైద్య శాస్త్రం చేసిందేమీ లేదనీ అంతా జీసెస్ దయ అంటూ చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది.