Read more!

నక్కని చూసి పులి....

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనేది రొటీనే. అదే  నక్కని చూసి పులి గోతులు తవ్వడం నేర్చుకోవడం అవసరం అంటారా? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పులిలాంటి తెలంగాణ ప్రభుత్వం నక్కలాంటి ఏపీ ప్రభుత్వం బాటలో నడవబోతోందని వస్తున్న వార్తలు రాజకీయ వర్గాలను ఆలోచింపజేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ బుర్రలోంచి పుట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎన్నో విమర్శలు తలెత్తాయి. ‘సేవ’ పేరుతో వాలంటీర్లుగా మారినవారు ప్రజల నెత్తిన గుదిబండలుగా మారారు. అధికార పార్టీకి అఫీషియల్ కార్యకర్తల్లా సేవ చేసి తరిస్తున్నారు.

ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్న పనులన్నీ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలు ఆల్రెడీ వున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇన్ని వేలమంది వాలంటీర్లను నియమించడం ద్వారా ఖజానా మీద భారం పెరిగింది. ఆల్రెడీ గతంలో ఆ బాధ్యతలు నిర్వహించిన వారికి పనేం చేయకుండానే జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజాధనం రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. వాలంటీర్ల ప్రజలకు వివిధ పనులను చేసే క్రమంలో  చేతివాటం ప్రదర్శించడం, కొందరు వాలంటీర్లు ప్రజల మీద దాడులు చేయడం లాంటి వార్తలు కూడా చదివాం. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా వివాదాలకు కేంద్రబిందువుగా మారిన వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలో కూడా ప్రారంభించడం అనేది కోరి  కొరివితో తలగోక్కోవడమే అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ  విషయంలో ముందుకే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ‘వాలంటీర్’ అనే పదం వాడకుండా ‘ఇందిరమ్మ’ కమిటీలు అనే పేరు పెట్టి వాలంటీర్ వ్యవస్థకు సమాంతరంగా వుండే వ్యవస్థను తెలంగాణలో కూడా అభివృద్ధి చేయబోతున్నట్టు అర్థమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేర్చే విధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి ఒక్క ఇందిరమ్మ కమిటీ సభ్యుడికి గౌరవ వేతనంగా నెలకు ఆరు వేలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇది నథింగ్ బట్ వాలంటీర్ వ్యవస్థేనని అర్థమైపోతోంది. ఒక్కో ఇందిరమ్మ  కమిటీలో ఐదుగురు సభ్యులుంటారు. ఏ పథకానికైనా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వుండేది ఈ ఇందిరమ్మ కమిటీ సభ్యులే. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది ఇందిరమ్మ కమిటీ సభ్యులను నియమిస్తారని తెలుస్తోంది. మరి ఈ కమిటీలు అమల్లోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థలాగానే తయారైతే, నిజంగానే నక్కని చూసి పులి  గోతులు తవ్వుకున్నట్టే అవుతుంది.