టీమ్ ఇండియానా టీమ్ గుజరాతా?!
posted on Jan 4, 2023 @ 2:30PM
ప్రధానిగా మోడీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ దేశంలో ఆయన స్వరాష్ట్రం అయిన గుజరాత్ ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎంతలా అంటే 2014 ఎన్నికలకు ముందు మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధి అన్న నినాదం అందుకుంది. తదాదిగా దేశంలో గుజరాత్ మోడల్ గా మారిందో లేదో పక్కన పెడితే.. మోడీ మాత్రం గుజరాత్ ప్రధాని అన్న ముద్ర వేసుకున్నారు. ఆయన హయాంలో చేపట్టిన నియామకాలు, చేసిన కేటాయింపులూ అన్నీ గుజరాత్ కు అగ్ర తాంబూలం... తర్వాతే మిగిలిన దేశం అన్న చందంగా సాగాయి. సాగుతున్నాయి.
ఇవి విమర్శకుల మాటలని కొట్టిపారేయడానికి లేదు. వాస్తవం కూడా అదే. ఈ నేపథ్యంలోనే మోడీ దేశానికి కాదు, గుజరాత్ కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కొట్టిపారేయలేమని పరిశీలకులు సైతం అంగీకరించారు. ఇప్పటి వరకూ కేటాయింపులు, నియామకాలలోనే గుజరాత్ కు ప్రాధాన్యత ఇచ్చినా.. ఇప్పుడు అది క్రీడా రాంగానికి కూడా పాకిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గుజరాత్ ఫస్ట్ విధానం టీమ్ ఇండియా సెలక్షన్స్ ను కూడా ప్రభావితం చేసినట్లుగా కనిపిస్తోందని క్రీడాభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సామాజాకి మాధ్యమంలో అయితే ఇది టీమ్ ఇండియా జట్లు కాదు.. టీమ్ గుజరాత్ జట్టుగా కనిపిస్తోందని సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ విమర్శలకూ, సెటైర్లకూ కారణం లేకపోలేదు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న శ్రీలంకతో టి20 సిరీస్ కు ఎంపికైన జట్టును చూస్తే ఎవరికైనా ఇది టీమ్ గుజరాత్ జట్టులా ఉందే అనిపించక మానదు. ప్రస్తుతం శ్రీలంకతో టి20 సిరీస్ కు ఎంపికైన జట్టును గమనిస్తే హార్థిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ మావి, దీపక్ హుడా... వీళ్లంతా గుజరాత్ కు చెందిన వారే. గతంలో అంటే 80, 90 దశకాల్లో భారత జట్టులో ముంబై అప్పటి బొంబాయి ఆటగాళ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అయితే అదేమీ ఎవరికీ పెద్దగా అభ్యంతరకరంగా అనిపించలేదు. ఎందుకంటే..దేశవాళీ క్రికెట్ లో, ముఖ్యంగా భారత జట్టుకు ఎంపిక అవ్వాలంటే రంజీల్లో రాణించి తీరాల్సిన అప్పటి పరిస్థితుల్లో రంజీల్లో తిరుగులేని జట్టుగా వరుస విజయాలతో దూసుకుపోయే బొంబాయి జట్లు ఆటగాళ్లకే ఎక్స్ పోజర్ అధికంగా ఉండేది. ఇప్పటికీ దేశ వాళి క్రికెట్ లో రంజీకి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. కానీ ఆ రంజీల్లో గుజరాత్ ప్రదర్శన అప్పుడే కాదు, ఇప్పుడూ అంతంత మాత్రమే.
అయితే ఇప్పుడు ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తూ టీమ్ ఇండియాలోకి ప్రవేశం గ్యారంటీ అన్న పరిస్థితి ఉంది. అయినా కూడా టీమ్ ఇండియా టి.20 జట్టులో ప్రతిభ గలిగి, రుజువు చేసుకున్న క్రీడాకారులను పక్కన పెట్టి మరీ ఇంత మంది గుజరాతీ క్రీడాకారులకు స్థానం కల్పించడం మోడీ గుజరాత్ మోడల్ క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.