గంటా గేమ్ ప్లాన్ ! పైపైకి రాజీనామా.. మరి లోలోనా..?
posted on Feb 8, 2021 @ 2:42PM
పైపైకి రాజీనామా.. మరి లోలోనా..? ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుది నిజమైన రాజీనామానా? లేక, 'రాజీ'..'డ్రామా'నా? అనే సందేహం అందరిలోనూ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా. ఆయన చిత్తశుద్ధిని, రాజీనామాను ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ నమ్మడం లేదు. ఇటు స్వపక్షం టీడీపీతో పాటు.. అధికార వైసీపీ సైతం ఆ.. అంతా ఉత్తుత్తి రాజీనామానే అంటూ తేల్చేస్తున్నారు. ఇంత త్యాగం చేసి.. అంత కస్టపడి గెలిచిన పదవిని తృణప్రాయంగా వదిలేస్తే.. చివరికి మిగిలింది ఇంతేనా..? ఫలితమేమీ లేదా..? గంటా మదిని తొలిచివేస్తున్న ఆవేదన ఇది. అందుకు కారణాలు అనేకం...
రాంగ్ ఫార్మాట్‌లో రాజీనామా!
గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తీరే సందేహాలకు అసలు కారణం. స్పీకర్‌కు రిజైన్ లెటర్ ఇవ్వాలంటే దానికో పద్దతి, ఫార్మాట్ ఉంటుంది. రాజీనామాకు కారణాలు చెప్పకుండా.. పదవి వదులుకుంటున్నట్టు సింపుల్‌గా, సూటిగా లేఖలో రాయాల్సి ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏమాత్రం అటూ ఇటూగా ఉండకూడదు. రాజీనామా లెటర్ స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే.. సభాధ్యక్షుడిదే ఫైనల్ డిసిషన్. రూల్స్ ఇంత సూటిగా, సుస్పస్టంగా ఉంటే... గంటా శ్రీనివాసరావు మాత్రం ఏకంగా స్పీకర్‌కే కండీషన్స్ పెట్టినట్టు రాజీనామా లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇలా చేసిన రాజీనామా సాంకేతికంగా చెల్లుబాటు కాదనేది నిపుణుల మాట. ఇంత చిన్న విషయం.. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు తెలియంది కాదనేది అందరికీ తెలిసిందే. అందుకే.. ఆయన చేసిన రాజీనామాను.. రాజీ..డ్రామా అంటున్నారు విశాఖవాసులు.
'రాజీ'.. 'డ్రామా'.. ఏంటంటే..?
ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలో గంట మోగుతుంటుంది. గంటా శ్రీనివాసరావు రాజకీయ చరిత్ర అలాంటిది మరి. 2009లో పీఆర్పీ నుంచి గెలిచిన గంటా.. ఆ ఉదయిస్తున్న సూర్యుడు హస్తం పార్టీలో అస్తమయం అయ్యాక.. శ్రీనివాసరావుకు మంత్రి పదవి రావడం అనూహ్యమే. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో గంట గట్టిగానే మోగింది. ఆ తర్వాత 2014 నాటికి టీడీపీ ప్రభంజనం చూసి.. పార్టీ మార్చి.. సైకిల్ గంటగా మారిపోయారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రిగా హవా కొనసాగించారు. 2019లోనూ గంటాకు ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇచ్చారు విశాఖ ఉత్తర ఓటర్లు. అయితే.. తాను గెలిచినా.. టీడీపీ అధికారం కోల్పోవడంతో.. 20 నెలలుగా గంట మూగబోయింది. ఇప్పుడు అనూహ్యంగా.. విశాఖ ఉక్కు కోసమంటూ.. గంట మరోసారి మారుమోగుతోంది. ఇన్నాళ్లూ ప్రజాసమస్యలపై మౌనంగా ఉన్న శ్రీనివాసరావు.. సడెన్‌గా రాజీనామా చేసేంత యాక్టివ్‌గా ఎందుకు మారారనేదే ప్రశ్న. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సొంతంగా ఉద్యమానికి సన్నాహాలు చేస్తూ.. దూకుడుగా వ్యవహరించడం వెనుక రాజకీయ ఎత్తుగడ దాగుందనేది వైజాగ్‌లో ఓపెన్ టాక్. టీడీపీని వీడేందుకే.. వైసీపీలో చేరేందుకే.. రాజీనామా డ్రామా అంటూ అంతటా చర్చ.
గోడ మీద గంటా..!
రాజకీయాల్లో నేతలు గోడ మీద పిల్లిలా పార్టీలు మారడం కామన్. అందులో గంటా శ్రీనివాసరావు మరింత ఎక్స్‌పర్ట్. పవర్‌లో ఉన్న పార్టీలోనే ఆయన ఉంటారనే టాక్. ఏడాదిన్నరగా ఆ పవర్ లేకుండా.. గంటా ఉండలేకపోతున్నారట. అందుకే.. ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి జంప్ చేద్దామా అని తెగ ఇదైపోతున్నారట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎపిసోడ్‌తో.. అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని గంటా సరిగ్గా క్యాచ్ చేశారని అంటున్నారు. ఇదే సరైన సమయమంటూ.. ఆలసించినా ఆశాభంగమంటూ.. రాజీనామా అస్త్రాన్ని సంధించారని చెబుతున్నారు. ఇదంతా ఉక్కు కర్మాగారంపై ప్రేమతోనో.. విశాఖ వాసులపై అభిమానంతో చేసింది కాదంటూ... కేవలం వైసీపీలోకి చేరేందుకే రాజీనామా డ్రామా అంటూ అన్ని పార్టీల నేతలూ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీతో అంటకాగడం కోసం ముందస్తు సన్నాహాల్లో భాగంగా.. ఉక్కు కోసం ఉత్తుత్తి ఉద్యమం ఊసెత్తుతున్నారని లైట్ తీసుకుంటున్నారు. గంటా కమిట్‌మెంట్‌పై ఎవరికీ పెద్దగా గురి లేదు. విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా.. పట్టించుకోకుండా.. ఇన్నాళ్లూ మౌనరాగం ఆలపించి.. ఇప్పుడు ఒక్కసారిగా నిద్ర లేచి.. నేను సైతమంటూ ఉక్కు పిడికిలి బిగించడం.. ఫ్యాన్ గాలి కోసమేననేది విశ్లేషకుల మాట.
గంటాకు గ్రాండ్ వెల్‌కమ్!
విశాఖలో రాజధాని అంటూ ప్రభుత్వం ఎంత బిల్డప్ కొడుతున్నా.. స్థానిక ప్రజానీకంలో మాత్రం చెప్పలేని భయాందోళనలు. కేపిటల్ పేరుతో ల్యాండ్ మాఫియా పెరుగుతుందని.. వైసీపీ నేతల రౌడీయిజం రెచ్చిపోతుందని.. ప్రశాంత సాగర తీరంలో కల్లోలం చెలరేగుతుందని.. ఇలా ప్రజల్లో అనేక అనుమానాలు. అందుకే.. ప్రభుత్వంపైనా.. స్థానిక వైసీపీ నేతలపై.. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక ప్రభుత్వ హస్తం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జగన్ కనుసన్నల్లోనే పోస్కో ఎంట్రీ ఇస్తోందని.. అదంతా క్విడ్ ప్రొకోలో భాగమంటూ అంతా చర్చించుకుంటున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు. ఉత్తరాంధ్ర వాసుల సెంటిమెంట్. దశాబ్దాల వెనుకబాటును తరిమేసి.. ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చిన స్టీల్ ఫ్యాక్టరీ ఇక మీద తమది కాకుండా పోతుందనే ఆలోచనను వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా... లక్షలాది మంది ప్రజలకు అదే జీవనాధారం. అందుకే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు కేంద్రం.. ఇటు రాస్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఆందోళనలతో తూర్పు తీరం ఎరుపెక్కుతోంది. ఆ ప్రజాగ్నికి జగన్ ప్రభుత్వం మాడిమసి కావడం తథ్యం.
గంటా.. వైసీపీ గేమ్ ప్లానా?
ప్రజాక్షేత్రంలో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోడానికి ప్రెష్ ఫేస్ కోసం ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్ సీపీ. ప్లాన్-బీ లో భాగంగా.. టీడీపీకి చెందిన స్ట్రాంగ్ లీడర్ గంటా శ్రీనివాసరావుకు గాలం వేసింది. ఆయన సైతం ఎప్పుడెప్పుడు గోడ దూకుదామా అన్నట్టూ రెడీగా ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం చెప్పకుండా, చర్చింకుండా.. రాజీనామా చేసేయడం వ్యూహాత్మకమే అంటున్నారు. త్వరలోనే విశాఖ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్ వస్తే.. వైసీపీకి ఘోర పరాభవం ఖాయం. టీడీపీకి ప్రజాబలం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే.. గంటాను సైకిల్ మీద నుంచి దించేసి.. ఆయనతో ఫ్యాన్‌కి రిపేర్ చేయించాలనేది వైసీపీ ఎత్తుగడ అంటున్నారు. లోలోన.. ఇప్పటికే గంటాకు, వైసీపీ అధిష్టానానికి మధ్య డీల్ కుదిరిందని చెబుతున్నారు. పైకి మాత్రం అధికార పార్టీ నేతల నుంచి గంటా శ్రీనివాసరావుకు కౌంటర్లు పడుతున్నాయి. ఆయన చేసిన రాజీనామాను డ్రామ అంటూ వైఎస్సార్‌సీపీ లీడర్లే తప్పుబడుతున్నారు. అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు లాంటి లీడర్లు రాజీనామాపై సెటైర్లు వేయడం.. అధికార పార్టీ మీడియాలో నెగటివ్ వార్తలు రావడం.. అంతా పొలిటికల్ గేమ్‌లో భాగమే..నట. పైపైకి గంటాను విమర్శిస్తున్నట్టు నటిస్తూ.. ఆయన ఇమేజ్‌ను ఇంకాస్త పెంచేసి.. ఆ తర్వాత పార్టీ కండువా కప్పేసి.. పబ్లిక్‌ను కన్ఫూజ్ చేసేసి.. ఎన్నికల్లో లాభపడాలనేది వైసీపీ మాస్టర్ ప్లాన్! ఇందులో నిజమెంత అనేది.. వైజాగ్‌లో ఎవరినడిగినా చెబుతారు. ఇంకేమైనా డౌట్ ఉంటే.. కేంద్రానికి జగన్ లేఖ రాయడం.. ఆ వెంటనే గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పడం గుర్తు చేసుకుంటే చాలు.. లోలోన ఏం జరుగుతోందో ఇట్టే అర్థమైపోతుంది..!