సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం.. పట్టపగలే టీడీపీ నేత హత్య!
posted on Dec 29, 2020 @ 1:47PM
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పట్టపగలు ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద అందరు చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, సుబ్బయ్య టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్నారు. రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్ లో ఎమ్మెల్యే పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చడం కిరాతక చర్య అని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన టీడీపీ నేత హత్య సీఎం జగన్ రెడ్డికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని.. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందన్నారు.
సుబ్బయ్య హత్యపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సీఎం సొంత జిల్లాలో టీడీపీ నేత హత్య రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందన్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మారణాయుధాలతో పాలిస్తారా? అని నిలదీశారు. చివరకు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హత్య రాజకీయాలకు తెరదీశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.