తెలంగాణలోనూ టీడీపీ-జనసేన పొత్తు?.. ఎఫెక్ట్ ఎవరిపై?
posted on Oct 12, 2023 @ 10:17AM
ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసిఎన్నికలకు వెళ్లనున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యా పొత్తు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక బీజేపీని కూడా కలుపుకొని వెళ్తాయా? లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో ఉన్నా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి మాత్రం బీజేపీ ఊసే రావడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పినట్లుగానే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న తెలంగాణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అధికారం దక్కించుకునే స్థాయిలో లేకపోయినా తెలంగాణ, జనసేనలకు తెలంగాణలో పెద్ద సంఖ్యలో క్యాడర్ ఉంది. అభిమానులు ఉన్నారు. ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ప్రాంతంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సత్తా నేటికీ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలోనూ తెలంగాణలో తెలుగుదేశం,జనసేన పొత్తు, పోటీ ప్రభావంపై కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎవరికీ అర్ధం కానీ పజిల్ గా కనిపిస్తున్నది. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? లేక రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగరనుందా? బీజేపీ ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుంది? మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీల వైపు వెళ్లిన ఆంధ్రా సెటిలర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికితే తప్ప తెలంగాణలో ఈసారి ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పరిస్థితి లేదు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదన్న భావన ఉంది. తెలుగుదేశం, జనసేనలు తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నా రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంటుందా? ఉండదా అన్న దానిపై మాత్రం ఇప్పటికింకా స్పష్టత లేదు. అయితే తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేనతో తమ పార్టీ కలసి ముందుకు సాగుతుందని అన్నారు. ఏపీలో తమ పార్టీతో జనసేన పొత్త పెట్టుకుందనీ, అది తెలంగాణాలో కూడా ఉంటుందని కాసాని అన్నారు.
అంతేకాదు, ఒకటి రెండు రోజులలో తాను రాజమహేంద్రవరంవెళ్ళి చంద్రబాబును ములాఖత్ లో కలుసుకుని ఈ విషయంపై చర్చిస్తానన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో కూడా ఈ విషయంపై చర్చిస్తామని చెప్పారు. కాసాని వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలలో మరో కోణం ఆవిష్కృతమైనట్లైంది. తెలంగాణలో బీజేపీతో పొత్తు లేదని తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో కలిసివేళ్లేందుకు సుముఖంగా లేరు. ఇక కాసాని చెప్పినట్లుగా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తే తెలంగాణ ఎన్నికలలో వీరి పొత్తు భారీ ప్రభావం చూపడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎన్ని సీట్లు గెలుచుకుంటారన్నది పక్కన పెడితే.. చాలా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ఈ కూటమి కచ్చితంగా నిర్దేశిస్తుందన్న పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన తెలంగాణలో ఇప్పటికే 32 సీట్లలో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. వాటిలతో తెలుగుదేశంకు బలం ఉన్న నియోజకవర్గాలు కూడా ఉండగా.. ఒకవేళ పొత్తులో పోటీకి దిగితే వాటిని తెలుగుదేశం పార్టీకి వదిలేయాల్సి వస్తుంది. అలాగే రెండు పార్టీలూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా సాధ్యమైనంత ఎక్కువ సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై ఈ ప్రభావం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలుగుదేశం తెలంగాణపై ఫోకస్ తగ్గించడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా వివిధ పార్టీలకు మద్దతుదారులుగా మారిపోయారు. ఇందులో ప్రధానమైనది బీఆర్ఎస్ కాగా.. గ్రేటర్ పరిధితో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ లాంటి పలు జిల్లాలలో తెలుగుదేశం క్యాడర్ బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. తెలంగాణలో ప్రతిసారి ఎన్నికల సమయంలో తెలుగుదేశం శ్రేణులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ చేతికి అందిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళారని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్దలు స్పందించకపోవడం, కేటీఆర్ చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలుగుదేశం, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్రంలో టీడీపీ క్యాడర్ ఏకతాటిపైకి వస్తుందని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో అధికారం చేపట్టబోయేది ఎవరన్నది ఈ కూటమే నిర్ణయించేంతగా ప్రభావం ఉంటుందని అంటున్నారు.