టీడీపీ జోలికొస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం! అధికారులకు చంద్రబాబు వార్నింగ్
posted on Feb 3, 2021 @ 2:16PM
జగన్ సర్కార్ అవినీతిని ప్రశ్నించాడనే పట్టాభిపై హత్యాయత్నం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా..? పొద్దుటూరులో నందం సుబ్బయ్య, జమ్మలమడుగులో గురుప్రతాప్ రెడ్డి, పుంగనూరులో ఓం ప్రతాప్...ఎంతమంది ప్రాణాలు బలిగొంటారు..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికిపందలు కాబట్టే వైసీపీ నాయకులు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు..? విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ఉన్మాదులతో కుమ్మక్కై రూల్ ఆఫ్ లా భగ్నం చేసే పోలీసులను, అధికారులను గుర్తు పెట్టుకుంటామన్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత హెచ్చరించారు.
టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో దశ నామినేషన్ల పురోగతిపై నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ధైర్యంగా నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులందరికీ అభినందనలు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టీడీపీ చూస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోంది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం జగన్ రెడ్డికి ఇష్టం లేదు. వైసీపీ వాళ్లను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తున్నారు. ప్రజలను మోసం చేయడం, రాష్ట్రానికి దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదు’ అని విమర్శించారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జగన్ రాబట్టింది గుండుసున్నా అన్నారు చంద్రబాబు. పోలవరానికి, అమరావతికి నిధులు లేవన్నారు. నేరాలు-ఘోరాలు చేయడం.. వాటిని ఎదుటివాళ్లపై రుద్దడం జగన్ దుష్టబుద్ధికి నిదర్శనమన్నారు చంద్రబాబు. బాబాయి వివేకానందరెడ్డి హత్య గుండెపోటుగా చిత్రించడం. తర్వాత టీడీపీపై ఆరోపణలు చేయడం. సీఎం అయ్యాక నిందితుల కొమ్ము కాయడం జగన్ నైజమన్నారు. ప్రతిపక్షంలో సీబీఐ విచారణ అడిగిన జగన్.. సీఎం అయ్యాక వద్దని లేఖ ఎందుకు రాశారు..? బాబాయి హత్యకేసులో నిందితులను కాపాడటం వెనుక మర్మం ఏమిటి అని చంద్రబాబు నిలదీశారు.